ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును బుక్ చేసిన రేవంత్ రెడ్డి..!

ఓటుకు నోటు కేసు.. 2015లో తెలుగు రాష్ట్రాలలో సంచలనమైంది. నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణ సీఎం కేసీఆర్‌లు జైళ్లకు పోయే విషయంలో పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును ఆ దేవుడు కూడా కాపాడలేడంటూ కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్‌ 8 అంటూ హైదరాబాద్‌పై పదేళ్ల హక్కు తమకు ఉందని చంద్రబాబు గళమెత్తారు. నీకు ఏసీబీ ఉంది.. నాకు ఏసీబీ ఉందంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కేసీఆర్‌తో రాజీ చేసుకుని.. ఉన్నఫలంగా చంద్రబాబు పెట్టే బేడా సర్దుకుని విజయవాడకు వచ్చారు.

చంద్రబాబు చేసిన ఘన కార్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది. ఆ కేసులో కేసీఆర్‌తో రాజీ పడడం వల్లే.. చంద్రబాబు అరెస్ట్‌ జరగలేదని చెబుతుంటారు. కేసీఆర్‌తో రాజీ పడినట్లుగా.. నాడు చంద్రబాబు వ్యవహరించిన తీరు ద్వారా తెలుస్తోంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిపై హక్కులను, హైదరాబాద్‌లో ఏపీ వాటాగా వచ్చిన సచివాలయ, ఇతర భవనాలను వదిలేసుకుని వచ్చారు. విజయవాడలో లగ్జరీ బస్సులో కొన్ని రోజులు, ఓ హోటల్‌లో మరికొన్ని రోజులు గడిపారు. బస్సులో ఉండి పాలన చేశానని చంద్రబాబు అప్పుడప్పుడు గొప్పా చెబుతుంటారు కూడా. ఏపీ ఆస్తులు, హక్కులను ఓటుకు నోటు కోసం తాకట్టు పెట్టిన చంద్రబాబు.. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడడం మానేశారు. ఎన్నికలు ఏవైనా ప్రాణం పెట్టి పని చేసే చంద్రబాబు.. 2015 తర్వాత ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ పరోక్షంగానైనా జోక్యం చేసుకోలేదు.

Also Read : అమరావతిలో జరిగినట్లు ఫైబర్‌ నెట్‌లోనూ జరగదని గ్యారెంటీ ఉందా..?

ఇన్ని వదులుకున్నా.. బాబును వదలనంటోంది..

ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఇన్ని వదులుకున్నా.. ఆ కేసులో సహ నిందితుడుగా ఉన్న రేవంత్‌ రెడ్డి మాత్రం బాబు ఆశలను నీళ్లు చల్లుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఎంపీగా గెలిచి.. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం విధానాలపై, కేసీఆర్‌ తీరుపై తనదైన శైలిలో పోరాటాలు చేస్తున్నారు. వాడీ వేడీ విమర్శలు సందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన పెగాసస్‌ నిఘా వ్యవహారంపై ఢిల్లీలో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. కేంద్రంపై, హోం మంత్రి అమిత్‌షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. పెగాసస్‌ నిఘాను ఉదహరిస్తూ కేసీఆర్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓటుకు నోటు వ్యవహారంలో తానే సాక్షిగా మారిపోయారు రేవంత్‌ రెడ్డి.

పెగాసస్‌ నిఘా విషయాన్ని ప్రస్తావిస్తూ.. 2015లోనే సీఏం కేసీఆర్‌.. ప్రతిపక్ష నేతలు, పక్క రాష్ట్ర సీఎంల ఫోన్లు ట్యాప్‌ చేస్తూ దొరికిపోయారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఒక్క మాటతోనే రేవంత్‌ రెడ్డి.. చంద్రబాబును అడ్డంగా బుక్‌ చేసేశారు. తప్పించుకుందామనుకున్న బాబును మరింతగా ఇరికించేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో తనతోపాటు చంద్రబాబు పాత్ర కూడా ఉందనేలా రేవంత్‌ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

నాడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించేందుకు ఐదు కోట్ల రూపాయలకు డీల్‌ కుదిరింది. ఈ వ్యవహారంలో రేవంత్‌ రెడ్డి 50 లక్షలు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ వీడియో సాక్ష్యాలతో దొరికిపోగా.. మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ.. అంటూ స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాడ్లిన చంద్రబాబు ఆడియోలతో అడ్డంగా బుక్కయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణ ఇప్పటికీ జరుగుతోంది. సాక్షుల వాగ్మూలంను ఏసీబీ కోర్టు నమోదు చేస్తోంది. ఈ కేసులో కోర్టులు, చట్టాలు చంద్రబాబు విషయంలో ఏం తేల్చబోతున్నా.. ప్రజల దృష్టిలో మాత్రం దోషిగా నిలబడ్డారు.

Also Read : మనసులో మాట మర్చిపోయారా బాబూ !

Show comments