ఎస్సీ, ఎస్టీల‌కు వేర్వేరు క‌మిష‌న్ లు : జ‌గ‌న్ పాల‌న‌లో మ‌రో మైలు రాయి

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి కొన‌సాగుతున్న అస‌మాన‌త‌లను ఏపీ సీఎం జ‌గ‌న్ తొల‌గిస్తున్నారు. గ‌త పాల‌కులకు భిన్నంగా చారిత్ర‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నారు. వాటి అమ‌లుకు చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నిస్తున్నారు.వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌ధానంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చారిత్ర‌క నిర్ణ‌యాలు తీసుకుంద‌ని చెప్పొచ్చు. న‌గ‌దు బ‌దిలీ ద్వారా ఆర్థిక భ‌ద్ర‌త క‌ల్పించ‌డ‌మే కాదు.. రాజ‌కీయంగా, సామాజికంగా మెరుగైన జీవ‌న విధానానికి బాట‌లు వేస్తోంది అన‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లే ఉన్నాయి.

వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం జగన్ సర్కారు ఇప్ప‌టికే యాభై ఆరు బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలో అదే మొదటిసారి. అంతేకాదు.. ఆయా పాలక మండళ్లను కూడా ఒకేసారి ప్రకటించడం జగన్ సర్కారు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే, ఎస్సీ, ఎస్టీల‌కు ఒకే క‌మిష‌న్ ఉండ‌డం వ‌ల్ల ఎక్క‌డో చోట న‌ష్ట‌పోతున్నామ‌ని ఇరు వ‌ర్గాలూ అంత‌ర్గ‌తంగా మ‌ద‌న‌ప‌డుతూ ఉండేవి. ముఖ్యంగా గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ద‌శాబ్దాల నాటి ఈ స‌మ‌స్య‌కు జ‌గ‌న్ చెక్ పెట్టారు. వేర్వేరు క‌మిష‌న్ లు ఏర్పాటు చేస్తామ‌ని పాద‌యాత్ర లో ఇచ్చిన హామీ అమ‌లుకు ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఫలించాయి. తాగా ఎస్సీ క‌మిష‌న్ ఏర్పాటుకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు.

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయడం వల్ల అవి మరింత సమర్థవంతంగా పనిచేసే వీలు కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని ఆయా వ‌ర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ గ‌త పాల‌కులు అది అంత ఈజీగా కాద‌ని ఈజీగా తీసుకున్నారు. అధికారంలోకి రాక ముందు చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో ఈ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్ తాను చేసి తీర‌తాన‌ని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేర‌కు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది.

2019లో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ సభ్యులు వెనక్కి పంపించారు. ప్రభుత్వం గతేడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మరోమారు బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టి ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించడంతో గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వీకే పట్నాయక్‌ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులకు అధికారిక సమాచారం పంపారు. అంత‌కు ముందే ప్ర‌త్యేక ఎస్టీ క‌మిష‌న్ కు కూడా ఆమోద ముద్ర ప‌డింది.

ఎస్సీ, ఎస్టీ వర్గాలు రెండూ సమాజంలో అణిచివేతకు గురైనవే. అందులోనూ ఎస్టీలకు సంబంధించి ప్ర‌త్యేక స‌మ‌స్య‌లు ఉంటాయి. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో ఎక్కువగా అన్యాయానికి గురవుతుంటారు. ఈ పరిస్థితుల్లోనే ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడిగా ఉండే కమిషన్ కారణంగా గిరిజనులకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి, దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుప‌రిచారు. ఇచ్చిన హామీ ప్రకారంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను చేప‌ట్టి సాధించారు. తాజాగా ప్ర‌త్యేక ఎస్సీ క‌మిష‌న్ కు లైన్ క్లియ‌ర్ అయింది.

Show comments