Idream media
Idream media
దర్శి మాజీ శాసన సభ్యుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పట్టణంలో గృహ నిర్మాణానికి పౌర్ణమి రోజున శంకుస్థాపన చేశారు. దర్శి కేంద్రంగా బూచేపల్లి కుటుంబం దాదాపు రెండు దశాబ్ధాల నుంచి రాజకీయం చేస్తోంది. బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శి నుంచి 2004లో శాసన సభకు ఎన్నికయ్యారు. వైఎస్ హవాలో స్వతంత అభ్యర్థిగా బూచేపల్లి గెలవడం విశేషం. ఆ తర్వాత 2009లో సుబ్బారెడ్డి కుమారుడైన బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో శిద్ధా రాఘవరావు చేతిలో ఓడిపోయారు. 2019లో తండ్రి సుబ్బారెడ్డి అనారోగ్యం కారణంగా పోటీకి దూరంగా ఉన్నారు. మద్ధిశెట్టి వేణుగోపాల్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు.
దర్శి కేంద్రంగా ఇన్నేళ్లుగా రాజకీయం చేస్తున్న బూచేపల్లి కుటుంబానికి స్థానికంగా సొంత ఇళ్లు లేదు. స్థిర నివాసం, కాలేజీ, వ్యాపారాలు అన్నీ సొంత ఊరు చీమకుర్తిలో ఉండగా.. స్థానికంగాను, దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని దర్శిలోనూ వారి రాజకీయ కార్యకలాపాలు సాగుతున్నాయి. తండ్రి, తనయుడులు ఇద్దరూ దర్శి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా.. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోలేదు. క్యాంపు ఆఫీసులతోనే నడిపించారు. అయితే ఇన్నాళ్ల తర్వాత.. దర్శిలో సొంత ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచన బూచేపల్లి రావడం రాజకీయపరమైన చర్చకు దారితీస్తోంది.
ఎస్సీ రిజర్డ్వ్ నియోజకర్గమైన సంతనూతలపాడులోని చీమకుర్తి మండలంలో బూచేపల్లిదే రాజకీయ అధికారం. ఎమ్మెల్యే కాక ముందు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఆ తర్వాత ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మలు చీమకుర్తి ఎంపీపీలుగా పని చేశారు. సుబ్బారెడ్డి, ఆ తర్వాత శివ ప్రసాద్ రెడ్డిలు దర్శి నుంచి శాసన సభకు పోటీ చేసి గెలిచారు. 2019లో తండ్రి అనారోగ్యం కారణంగా బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నా.. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా పోలింగ్ పూర్తయిన పరిషత్ ఎన్నికల్లో బూచేపల్లి వెంకాయమ్మకు వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వం దక్కింది. ఆమె జడ్పీ చైర్ పర్సన్ కావడం లాంఛనమే.
Also Read : ‘తూర్పు’ రాజకీయం – ఒకప్పటి మిత్రులు.. నేడు రాజకీయ ప్రత్యర్థులు
2024లో శివ ప్రసాద్ రెడ్డి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతారు. సొంత నియోజకవర్గం దర్శి టిక్కెట్‌ను ఆశిస్తారు. అప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మద్ధిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్ మధ్య టిక్కెట్ కోసం పోటీ ఏర్పడుతుంది. 2019లో వైసీపీ అభ్యర్థిగా తనను ప్రతిపాదించిన బూచేపల్లి కోసం మద్ధిశెట్టి 2024లో పోటీ నుంచి తప్పుకుని, శివప్రసాద్‌కు లైన్ క్లియర్ చేస్తారా..? లేదా..? అనేదే ప్రస్తుతం ఆసక్తికర అంశం. బూచేపల్లి, మద్ధిశెట్టి వేణుగోపాల్ మధ్య 2019లో ఒప్పందం ఏమైనా జరిగి ఉంటుందా..? అనే సందేహాలు కూడా ఉన్నాయి.
అయితే 2024లో వైసీపీ టిక్కెట్ ఎవరికి వస్తుందనే అంశంపై నియోజకవర్గంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన సిద్ధా రాఘవరావు 2019లో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి 2019 ఎన్నికలకు చివరి నిమిషంలో వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున బరిలో నిలుచున్నారు. దీంతో టీడీపీకి లోక్‌సభ అభ్యర్థి కరువయ్యారు. దర్శి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన శిద్ధా రాఘవరావును చంద్రబాబు బలవంతంగా ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీకి దింపారు. అయిష్టంగానే ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చే సిన శిద్ధా రాఘవరావు ఓడిపోయారు. దర్శిలో కనిగిరి నియోజకవర్గానికి కదిరి బాబూరావును పోటీ చేయించగా.. అక్కడ కూడా టీడీపీ ఓడిపోయింది.
ఎన్నికలు ముగిసిన ఏడాదికి మారిన రాజకీయ పరిణామాల్లో శిద్ధా రాఘవరావు, కదిరి బాబూరావులు వైసీపీ కండువా కప్పుకున్నారు. కదరి బాబూరావు కనిగిరికి పరిమతమవుతారనుకున్నా.. 2024లో దర్శి వైసీపీ టిక్కెట్ శిద్ధా రాఘవరావు ఆశించే అవకాశం లేకపోలేదు. ఈనేపథ్యంలో వైసీపీ అభ్యర్థిత్వం కోసం మద్దిశెట్టి వేణుగోపాల్(కాపు), బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, శిద్ధా రాఘవరావు(వైశ్య)ల మధ పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో దర్శి రాజకీయం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
Also Read : ప్రజలే నేను అంటూ సాగిన ప్రజా నాయకుడు ప్రకాశం పంతులు