ప‌వ‌న్ నాయ‌కుడిగా ఎదగాలంటే ఇదే స‌రైన టైం..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు న‌టుడిగా ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ఓ ద‌శ‌లో అన్న మెగాస్టార్ చిరంజీవి క‌న్నా ప‌వ‌న్ పేరే యువ‌త‌లో ఓ రేంజ్ లో మార్మోగేది. ప‌వ‌న్ ఆవేశం, ఆద‌ర్శం యువ‌త‌ను ఆక‌ట్టుకునేది. ప‌వ‌న్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఆవేశంగానే సాగింది. ప్ర‌శ్నించ‌డానికే వ‌స్తున్నామంటూ త‌మ పార్టీది ఉద్య‌మ పంథా.. అని చాటే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, టీడీపీతో జ‌త క‌ట్ట‌డం ప‌వ‌న్ పొలిటిక‌ర్ కెరీర్ కు మైన‌స్ గా మారింది. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత బీజేపీతో జ‌త క‌ట్ట‌డం కూడా చాలా మందికి రుచించ లేదు. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను బేరీజు వేసుకుని ప‌వ‌న్ స‌రైన నిర్ణ‌యం తీసుకుంటే నాయ‌కుడిగా ఎదిగే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

గతంలో పవన్ పాచిపోయిన లడ్డూలు అంటే కేంద్రం మీద ఒక్కసారిగా విరుచుకుపడితే ఆ సౌండ్ ఎంతలా ఢిల్లీలో రీసౌండ్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇపుడు అలాంటి పొలిటికల్ సౌండ్ చేయడానికి సరైన సమయం అని అంతా అంటున్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఏపీ మొత్తానికి సంబంధించినది. ఇక రాజకీయంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. దాంతో పవన్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద గట్టిగా గర్జిస్తే హస్తినలోనే మొత్తం రాజకీయ లెక్కలు మారిపోతాయి. అంతే కాదు ఏపీ రాజకీయాలలో కూడా భారీ తేడాలు వచ్చేస్తాయి. పవన్ సై అనాలే కానీ జనసైనికులు ఉవ్వెత్తున ఉద్యమంలో ఉరుకుతారు. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న పోరాటం వేరు. పవన్ వస్తే కనుక దాని రూపురేఖలు పూర్తిగా మారిపోవడం తధ్యమనే అంటున్నారు.

పవన్ ఇలాంటి హాట్ టాపిక్ ని తీసుకుంటే ఏపీ జనాల గుండెల్లో నిలిచి పోవడమే కాకుండా ఆయన రాజకీయాలోకి వచ్చినందుకు పార్టీ పెట్టినందుకు కూడా సార్ధకత చేకూరుతుంది అంటున్నారు. పవన్ కి రాజకీయంగా లాభం చేసే వ్యవహారమే కానీ మరోటి కూడా ఇది కాదు అని చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పెడుతున్న ఇబ్బందులు నిధులు ఇవ్వకుండా సృష్టిస్తున్న అవాంతరాల మీద కూడా పవన్ గొంతు ఎత్తితే ఆ ఇంపాక్ట్ గోదావరి జిల్లాల మీద ఉంటుంది అంటున్నారు. అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని కూడా ఒక్క దెబ్బకు అన్నట్లుగా పవన్ గట్టిగా తగులుకుంటే ఆయన చేతిలో కచ్చితంగా అయిదురు జిల్లాల జనం ఉంటారు అని చెబుతున్నారు. కానీ ఇవేమీ ప‌ట్టించుకోకుండా ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. అలాంటి ప‌వ‌న్ ఏపీకి నాయ‌కుడిగా అవ‌కాశాలు వ‌స్తాయా? అనేది వేచి చూడాలి.

Show comments