రాయలసీమ ఎత్తిపోతలు.. ఎన్జీటీ విచారణ అసంపూర్ణం

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. అటవీ, పర్యావరణ శాఖ తమ నివేదికను అందించేందుకు సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే నెల 8వ తేదీకి బెంచ్‌ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వివాదంపై కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ (కేఆర్‌ఎంబీ) తమ నివేదికను అందించింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన కేఆర్‌ఎంబీ బృందం అక్కడ తాము చూసిన పరిస్థితులను ఎన్జీటీకి నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తమ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రాజెక్టును ఎందుకు చేపట్టదలుచుకున్నాము..? ఇప్పటి వరకు జరిగిన పనులను అందులో వివరించింది.

2020 అక్టోబర్‌ 19న ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరిస్తూ.. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఎన్టీటీలో పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్‌లో కోరింది. ఈ మేరకు పనులు చేసే కాంట్రాక్టు సంస్థ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, జలశక్తి శాఖ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, కేఆర్‌ఎంబీని ప్రతివాదులుగా చేర్చింది.

ఈ పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ.. క్షేత్రస్థాయి పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీని ఆదేశించింది. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న కేఆర్‌ఎంబీ బృందం పరిశీలన ఈ నెల 12వ తేదీన జరిగింది. డీఎం రాయపురే నేతృత్యంలోని బృందం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ నెల 14వ తేదీన తమ నివేదికను ఈ ఫైలింగ్‌ చేయకుండా నేరుగా మెయిల్‌ ద్వారా అందించింది. 16వ తేదీన మరోసారి విచారణ చేపట్టిన ఎన్జీటీ ఈ ఫైలింగ్‌ ద్వారా నివేదిక అందించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ లోపు కేఆర్‌ఎంబీ నివేదిక ఇచ్చినా.. అటవీ, పర్యావరణ శాఖ తమ నివేదికను అందించేందుకు సమయం కోరడంతో మరోమారు విచారణ వాయిదా పడింది.

Also Read : రాయలసీమ లిఫ్ట్ పనులకు అసలు కారణమదే, ఎన్జీటీకి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం

Show comments