Idream media
Idream media
ప్రజలను మోసం చేసి జేబులు నింపుకున్న వారిని మోసం చేసి తిరిగి ఆ డబ్బులు ప్రజలు పంచే సన్నివేశాలు తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే రీయల్‌గా జరిగింది. అయితే ఈ ఘటనలో ప్రజలను మోసం చేసిన వారి నుంచి డబ్బు కొట్టేసిన వాళ్లు.. ఆ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపారు. స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఈ తంతు తెలంగాణలో జరిగింది.
గద్వేల్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేసే మెతుకు రవీందర్ సన్ పరివార్, మెతుకు వెంచర్స్ పేరుతో ఏడు కంపెనీలను రిజిష్టర్ చేశారు. నెలవారీగా అధిక వడ్డీ చెల్లిస్తానని చెప్పి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. లక్ష రూపాయలకు నెలకు ఆరు వేల రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పడంతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలు భారీగా డిపాజిట్లు చేశారు. మూడు శాతం కమీషన్ ఇస్తానని చెప్పడంతో డిపాజిట్ చేసిన వారే తిరిగి ఏజెంట్లుగా మారి డిపాజిట్లు చేయించారు. మల్టిలెవల్ మార్కెటింగ్ తరహాలో మొత్తం 150 కోట్ల రూపాయల వరకూ మెతుకు రవీందర్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు.
అయితే డిపాజిట్‌దారులకు కొన్ని నెలలు సక్రమంగా వడ్డీ చెల్లించిన మెతుకు రవీందర్.. ఆ తర్వాత మొఖం చాటేశారు. మోసపోయామని తెలుసుకున్న డిపాజిట్‌దారుడు ఒకరు 2018లో షామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. మెతుకు రవీంద్ర భాగోతం అంతా వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆయనతోపాటు మరికొంత మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. సేకరించిన డిపాజిట్లలో 14 కోట్ల రూపాయలను హైదరాబాద్ సివారులోని ఆర్సీపురంలోని ఓ ఫ్లాట్‌లో రవీందర్ దాచారు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లిస్తానని రవీందర్ పలువురితో చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అభిజిత్ అనే వ్యక్తి.. తన తండ్రి నరేష్‌తో కలసి ఫ్లాట్‌లో ఉన్న 14 కోట్ల రూపాయలను కొట్టేశారు. ఆ మొత్తంతో విలాసవంతమైన జీవితం గడిపారు. స్థిరాస్తులు కొనుగోలు చేశారు. నరేష్ కుమార్తె.. నగర సివారులోని ఓ పంచాయతీ సర్పంచ్‌గా కూడా పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన పలువురికి నరేష్ ఎలక్షన్ ఫండ్ కూడా ఇచ్చారు.
జైలు నుంచి విడుదలైన రవీందర్.. ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. అక్కడ నగదు లేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలు కోణాల్లో విచారణ చేసిన పోలీసులు.. అభిజిత్ తన తండ్రి నరేష్‌తో కలసి ఈ డబ్బు కొట్టేశారని పోలీసులు గుర్తించారు. మోసగాళ్లకే మోసగాళ్లుగా మారిన అభిజిత్, నరేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read : ఎర్రకోట మీదనే ఎందుకు?