గ‌తం నుంచి పాఠాలు.. వ‌ర్త‌మానానికి మోదీ వ్యూహాలు

భారత దేశ జనాభాలోని దాదాపు ఐదో వంతు మంది ప్రజలు ఐదు నెల‌ల క్రితం జ‌రిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ తీర్పు వెలువ‌రించారు. బీజేపీకి అంత‌గా అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని పార్టీ దాదాపు ఏడేళ్లుగా దేశంలో అధికారంలో ఉంది. భారత పార్లమెంటులోని ఉభయ సభల్లో సంఖ్యాబలం ఉండడంతోపాటూ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను బట్టి చూస్తే, బీజేపీ భారత్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. గ‌త సాధారణ ఎన్నికల్లో బీజేపీ మొత్తం దేశమంతా ప్రభావం చూపినా తమిళనాడు, కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

పశ్చిమ బెంగాల్లో 43 శాతం సీట్లు సాధించింది. అంతకు ముందు అది ఆ రాష్ట్రంలో ఎప్పుడూ 5 శాతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయా రాష్ట్రాల‌లో సీట్లు పెంచుకోవ‌డంతో పాటు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న స‌మ‌యంలో కూడా ప్ర‌ధాని బెంగాల్ ప్ర‌చారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఆయ‌న‌కు విమర్శ‌లు కూడా తెచ్చిపెట్టింది. అయినా లెక్క చేయ‌కుండా ఆ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఇదే అదునుగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స‌హా ప‌లువురు విప‌క్ష నేత‌లు మోదీని ఇరుకున పెట్టేందుకు, వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో బీజేపీ విజ‌య‌విహారాన్ని అడ్డుకునేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

విప‌క్ష పార్టీలు వ‌రుస‌గా వేస్తున్న ప్ర‌ణాళిక‌లు, భేటీల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ కూడా అల‌ర్ట్ అయ్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల మాదిరిగా వారికి అవ‌కాశం ఇవ్వ‌కుండా మ‌రోసారి చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. పార్ల‌మెంట్ న‌డ‌వ‌కుండా అడ్డుప‌డుతున్న తీరును బ‌య‌ట మీడియా స‌మావేశాల ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని త‌మ పార్టీ ఎంపీల‌కు సూచించారు. అలాగే ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప్ర‌జ‌ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇటీవ‌లే ఓ యాప్ ప్రారంభించారు. ఇప్పుడు గ‌త పాల‌న‌లో జ‌రిగిన లోపాల‌ను ఎత్తిచూపుతూ, తాము తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాల‌ను తెలియ‌జేస్తూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు మోదీ.

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలన, రాజకీయంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని, అలాంటి పార్టీ ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌రిపాలించినా దేశానికి ఉప‌యోగం ఉండ‌దంటూ త‌న‌దైశ శైలిలో వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుకు సిద్ధంగా ఉంద‌ని వివ‌రిస్తున్నారు. బీజేపీ ప్ర‌భుత్వం 2014 నుంచి తీసుకొచ్చిన కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ను హైలెట్ చేసే ప‌నిలో ఉన్నారు. గత ప్రభుత్వాలు పాలన, రాజకీయంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవకపోవటం వల్ల జీఎస్టీ సంస్కరణలు ఏళ్ల తరబడి నిలిచిపోయాయని, త‌మ ప్రభుత్వవం జీఎస్టీని అమలు చేయటమే కాదు, రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేసినట్లు వివ‌రిస్తున్నారు.

ఇలా త‌న గ‌ళాన్ని గ‌ట్టిగా వినిపించేందుకు మోదీ సిద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా మూడో సారి స‌త్తా చాటాల‌ని ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకున్న ప్ర‌భుత్వం త‌మ‌దంటూ ప్ర‌చారం నిర్వ‌హిస్తూ విప‌క్షాల దూకుడుకు క‌ళ్లెం వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Show comments