AP Municipal Election, Polling Completed – నెల్లూరులో తక్కువ.. కుప్పంలో ఎక్కువ..

ఆంధ్రప్రదేశ్‌లో మినీ మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. నిర్ణీత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ… కుప్పం సహా పలు చోట్ల టీడీపీ చేసిన హడావుడి తప్పా.. పోలింగ్‌ అంతా ప్రశాంతంగా సాగింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పుం నియోజకవర్గంలోని కుప్పం పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతుండడంతో.. ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్‌లో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి నెల్లూరులో 38.90 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. మొత్తంగా ఇక్కడ 50 శాతం లోపే పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌తో పోల్చితే.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో అధికంగా పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం మూడు గంటల సమాయానికి చిత్తూరు జిల్లా కుప్పంలో 71.96 శాతం, వైఎస్సార్‌ కడప జిల్లా కమాలపురంలో 71.84, రాజంపేటలో 60.47, అనంతపురం జిల్లా పెనుగొండలో 75.99. కర్నూలు జిల్లా బేతంచర్లలో 67.99, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 55.48, ప్రకాశం జిల్లా దర్శిలో 68.36, గుంటూరుజిల్లా గురజాలలో 66.50, దాచేపల్లిలో 67.97, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 69.91, కొండపల్లిలో 57.20, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు 67.45 శాతం చొప్పన పోలింగ్‌ నమోదైంది. చివరి రెండు గంటల్లో మరో పది శాతం పోలింగ్‌ అదనంగా నమోదై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలో పోలింగ్‌ 80 శాతం దాటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?

Show comments