Idream media
Idream media
చరిత్రను ఆధారంగా చేసుకుని వర్తమానంలో పని చేసి భవిష్యత్ కోసం బంగారు బాటలు వేసుకోవాలంటారు. తన భవిష్యత్ కోసం కష్టపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆ చరిత్రే ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రతిపక్షంలో ప్రజల తరఫున పని చేసి తనలోని నాయకుడుని సానబట్టేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలన్నీ తన తండ్రి చంద్రబాబు గతం వల్ల నీరుగారిపోతున్నాయి. అద్దాల మేడను వదిలి జనాల్లోకి వస్తున్నా ఫలితం లేకపోగా.. తిరిగి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో.. తమరేం చేశారనే ప్రశ్న ఎదురవుతుండడంతో చినబాబుకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది.
రైతుల విషయంలో అలా..
ధాన్యం కొనుగోలు, నగదు చెల్లింపునకు మధ్య కాలాన్ని ఆసరాగా చేసుకుని.. రైతులకు డబ్బులు చెల్లించడంలేదంటూ విమర్శలు చేస్తూ.. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే చినబాబు విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రైతు భరోసా కేంద్రాలను వివరిస్తున్న వైసీపీ నేతలు.. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నిస్తుండడంతో చినబాబు నోట మాట రావడం లేదు. రైతుల పంట, బంగారు రుణాలను భేషరతుగా మాఫీ చేస్తానన్న హామీని గుర్తు చేసిన సమయంలో టీడీపీ నుంచి కౌంటర్ కరువవుతోంది.
జాబ్ క్యాలెండర్‌పై కొనితెచ్చుకున్న విమర్శలు..
పదివేల పైచిలుకు ఉద్యోగాలతో వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్‌పై చినబాబు ఉద్యమం చేశారు. లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి.. పదివేల ఉద్యోగాలతో జాబ్‌క్యాలెండర్‌ను విడుదల చేసిన సీఎం జగన్.. యువతను మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. ఈ వెంటనే చినబాబుకు కౌంటర్ వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.21 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేసిన వైసీపీ నేతలు.. తమ తండ్రి ఇస్తానన్న ఇంటికో ఉద్యోగం హామీ ఎంత మేర అమలు చేశారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, అది ఇచ్చే వరకు నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చి యువతను మోసం చేసింది ఎవరనే ప్రశ్నకు చినబాబు నుంచి సమాధానం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామని ప్రయత్నించిన ప్రతిసారి తానే ఇరుకునపడిపోతుండడంతో లోకేష్ ఏం చేయాలో పాలుపోవడం లేదు.
Also Read : చంద్రబాబుకు కూడా జగన్ నాయకత్వం కావాలంట