లాక్ డౌన్ రివ్యూ 3 – అసురుడి హత్యాకాండ

కరోనా మహమ్మారి తాకిడికి ఎక్కడికక్కడ జనం ఇళ్లలోనే లాక్ డౌన్ అయిన పరిస్థితిలో ఎంటర్ టైన్మెంట్ కోసం చిన్ని తెరమీద ఆధారపడటం తప్ప వేరే మార్గం లేదు. ఆ క్రమంలోనే ప్రేక్షకులు తెలుగు మాత్రమే కాక ఇతర భాషల్లోనూ పేరు తెచ్చుకున్న లేదా ఆసక్తి రేపిన సినిమాలు, వెబ్ సిరీస్ ల వైపు ఆధారపడుతున్నారు. అందులోనూ వీటికి సంబంధించి విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో దక్కుతుండటంతో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రైమ్ లాంటి యాప్స్ ఇతర బాషా చిత్రాలకు తెలుగులోనూ సబ్ టైటిల్స్ ఇవ్వడం ఇవి అధిక శాతం చూసేందుకు కారణం అవుతున్నాయి. ఆ క్రమంలో అసుర్ అనే వెబ్ సిరీస్ గురించి ఆన్ లైన్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఊట్ స్ట్రీమింగ్ సైట్ ద్వారా విడుదలైన ఈ అసుర్ కథాకమామీషు ఏంటో చూద్దాం

కథ

ఢిల్లీ కేంద్రంగా అత్యంత దారుణమైన స్థితిలో కొందరి హత్యలు జరుగుతూ ఉంటాయి. అవి ఎవరు చేస్తున్నారో అంతు చిక్కదు. దీంతో సిబిఐ రంగంలోకి దిగుతుంది. అందులో సీనియర్ ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్ అయిన ధనుంజయ్ రాజ్ పుత్(అర్షద్ వార్సీ)భార్య కూడా చాలా ఘోరంగా చంపబడుతుంది. కానీ అదే టీమ్ లో ఉండే నిఖిల్ నాయర్(బరున్ సొబ్తీ)సేకరించిన సాక్ష్యాల వల్ల నేరం ధనుంజయ్ మీదకు వెళ్లి జైలు పాలవుతాడు. కానీ మారణకాండ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. కేసు రాను రాను క్లిష్టంగా మారుతుంది. దీని వెనుక సూత్రధారి వారణాసిలో ఉన్నాడని అర్థమవుతుంది. జైలు నుంచే ధనుంజయ్ ఆపరేషన్ మొదలు పెడతాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, ఎందుకీ హత్యలు చేశాడు, ధనుంజయ్ తో పాటు నిఖిల్ ని ఎందుకు టార్గెట్ చేశాడు అనేది ఐదున్నర గంటల పాటు సాగే అసుర్ ని పూర్తిగా ఫాలో అయితే అప్పుడు అర్థమవుతుంది.

పర్ఫెక్ట్ క్యాస్టింగ్

అసుర్ బలమంతా క్యాస్టింగ్ లోనే ఉంది. ప్రొడక్షన్ పరంగా కొంత రాజీ ఉన్నప్పటికీ వీళ్ళు తమ యాక్టింగ్ తో అసుర్ ని నిలబెట్టారు. మున్నాభాయ్ ఎంబిబిఎస్ తో పేరు తెచ్చుకున్న అర్షద్ వార్సీ అంతా తానై అసుర్ ని నడిపించాడు. సైకో వల్ల భార్యను పోగొట్టుకుని హంతకుడిని వెతికి పట్టుకునే క్రమంలో తన పరిణితి చెందిన నటనను చక్కగా ప్రదర్శించాడు. నిఖిల్ గా నటించిన బరున్ కూడా ఆకట్టుకుంటాడు. అతని భార్య నైనాగా కథలో కీలక పాత్ర పోషించిన అనుప్రియ గోయంకా కూడా బాగా చేసింది. అయితే అసలు కిల్లర్ గా నటించిన విశేష్ బన్సాల్ మాత్రం లుక్స్ పరంగా పెర్ఫార్మన్స్ పరంగా అంత వెయిట్ ని మోయలేకపోయాడు. కానీ ఇదే పాత్రను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అబ్బాయి మాత్రం జీవించేశాడు. అంత చిన్న వయసులో క్రూరత్వంలోని ఇంటెన్సిటీని చూపించిన తీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది.

ఏంటి ప్రత్యేకత

అసుర్ ఆద్యంతం ఒకే టెంపోలో డీవియేషన్ లేకుండా సాగుతుంది. కొన్ని మలుపు మన ఊహలు అనుగుణంగానే సాగినప్పటికీ స్క్రీన్ ప్లేలోని వేగం వల్ల దర్శకుడు ఓని సేన్ ఎక్కువ ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు . ఇక్కడ రచయిత గౌరవ్ శుక్లా పనితనాన్ని కూడా మెచ్చుకోవాలి. ప్రతి ఎపిసోడ్ ని వీలైంత క్రిస్పీగా మలిచి అనవసర ప్రహసనాలకు చోటివ్వలేదు. రెగ్యులర్ గా చూసే సైకో కథలా కాకుండా ఆ కిల్లర్ అలా దుర్మార్గుడిగా మారడానికి గల కారణాలు ఇతిహాసాలకు లింక్ చేసి అసురుడు మంచివాళ్ళనే ఎందుకు చంపుతాడు అని సూత్రీకరించిన తీరు అసుర్ ఇతర సైకో థ్రిల్లర్స్ తో పోలిచినప్పుడు డిఫరెంట్ గా నిలబెడుతుంది.

వెబ్ సిరీస్ కాబట్టి తప్పని ల్యాగ్ అక్కడక్కడ ఉన్నప్పటికీ సాధ్యమైనంత మేర విసుగు లేకుండా చూసేలా ఒని సేన్ తీర్చిదిద్దిన తీరు నిరాశపరచాడు. ముఖ్యంగా చివరి మూడు మూడు ఎపిసోడ్లు వేగంగా పరిగెత్తుతాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అసలు కిల్లర్ ఎవరు అని గుర్తించే క్రమాన్ని కూడా చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. రెగ్యులర్ గా క్రైమ్ థ్రిల్లర్స్ చూసేవాళ్ళకు ఇది మరీ ఎక్స్ ట్రాడినరీగా అనిపించదు కాని ఉన్నంతలో ఎంగేజ్ చేస్తూ వాచబుల్ అనిపించడం మాత్రం ఖాయం.

చివరి మాట

సైకో థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసేవాళ్ళకు నిరాశ కలిగించని సిరీస్ గా అసుర్ ని చెప్పొచ్చు. ప్రారంభంలో ఒక హత్యను కాస్త భీతి గొలిపేలా చూపించినప్పటికీ తర్వాత మాత్రం అలాంటివేవి కనిపించవు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ పేరుతో సెక్స్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవేవి లేకపోవడం అసుర్ కున్న పెద్ద ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మూడ్ ని క్యారీ చేసింది. ఒకవేళ ఇండియన్ కంటెంట్ తో పాటు ఇతర బాషల థ్రిల్లర్ ని కూడా విపరీతంగా చూసే అలవాటు ఉంటె అసుర్ మరీ గొప్పగా అనిపించకపోవచ్చు కాని ఖచ్చితంగా టైం వేస్ట్ అయ్యిందనే ఫీలింగ్ మాత్రం కలిగించదు. ముఖ్యంగా రెండో సగంలో వచ్చే ఎపిసోడ్స్ అసుర్ ని చాలా బలంగా నిలబెట్టాయి. ట్రై చేయండి.

Show comments