Idream media
Idream media
సృష్టిలో ఏదీ నేరుగా వుండదు. పొరలుపొరలుగా వుంటుంది. వాటిని ఆవిష్కరించడానికి ఎంతో మానవశక్తి కావాలి. కొబ్బరిలోని అద్భుత రుచిని తెలుసుకోడానికి ఎన్నో వందల ఏళ్లు పట్టి వుంటుంది. చెట్టుని గుర్తించడం ఒక కష్టమైతే, ఎక్కి కాయని అందుకుని కష్టపడి ఒలిచి తినాలి. తాటిపండు కథ కూడా ఇదే. చెట్టులోంచి కల్లు వస్తుందని తెలుసుకోవడం మనిషి సృజనకు నిదర్శనం. ఏది తినచ్చో, తినకూడదో తెలుసుకోడానికి కూడా శతాబ్దాలు పట్టి వుంటుంది.
ఎన్నింటినో జయించిన మనిషి ప్రకృతి ముందు ఓడిపోతాడు. ఒక సునామీ సమస్త టెక్నాలజీని తినేస్తుంది. భూకంపం ధాటికి అద్భుత కట్టడాలు కూడా మిగలవు. దీన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మనిషి దురాశ ముందు ఇంకో మనిషి ఓడిపోవడం… తిండికి లోటు లేని కాలంలో కూడా మనిషి ఆకలితో చచ్చిపోతున్నాడు.
సమస్త పాపాల్ని హరించే దేవుడే పాపాల్లో కూరుకుపోయినట్టు , భూమ్మీది మురికినంత కడిగి పారేసే నీటికే మురికి అంటుకుంది. అడుగడుగునా మనిషి దాహం తీర్చే నీళ్లు సీసాల్లో ఇరుక్కుపోయాయి. ఉచితంగా వచ్చే నీళ్లను నమ్మాలంటే భయంగా ఉంది. భూమి అడుగు పొరల్లో దాగి ఉన్న నీటిని కూడా కలుషితం చేసేశాం. స్వచ్ఛంగా ఉన్న అన్నింటిని కలుషితం చేసే వరకూ నిద్ర పట్టదు.
మనిషికున్న అతిపెద్ద బలహీనత … వాస్తవాన్ని ఇష్టపడక పోవడం. భ్రాంతినే ప్రేమిస్తాడు. ప్రతి కలకూ మెలకువ తప్పదని తెలిసినా కలనే ప్రేమిస్తాడు. జీవించే ప్రతి క్షణమూ వాస్తవమే అయినా , భ్రాంతిలో జీవించడానికే ఇష్టపడతాం. విశ్వంలో పిచ్చిగా తిరిగే శకలాల్లా కలలన్నీ మన చుట్టూ తిరుగుతూ వుంటాయి. కలల్ని ఢీకొని బూడిదవుతాయి. చివరికి శూన్యంలో చిక్కుకుం టాం. ఈ సుదీర్ఘ ప్రయాణం తల్లి గర్భంలో మొదలుతుంది. భూమి గర్భంలో ముగుస్తుంది. మనిషంటే గర్భస్థ శిశువు. అనంత విశ్వంలో అగమ్య బాటసారి.
మనిషికి మాత్రమే కాదు ఈ సృష్టిలో అనేక జీవజాలానికి వాటా వుంది. ఒక చిన్న మొక్కపై ఒక పురుగు పాకుతూ వుంటుంది. ఎక్కడికో హడావుడిగా వెళుతూ వుంటుంది. దాని చిన్న జీవితంలో కూడా జననం, కలయిక, ఆహార అన్వేషణ, పెద్ద పురుగుల చేతికి చిక్కకుండా కాపాడుకోవడం చివరికి మరణం ఇన్ని వున్నాయి. మనకు ఒక దినం, దానికి పది సంవత్సరాలు కావచ్చు. నిజానికి కాలాన్ని తెలుసుకోవడం ఒక పిచ్చి పని. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అది ఆగదు. నువ్వు నిద్రపోతున్న ప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది నిద్రపోతుంటారు. కొన్ని కోట్ల మంది మేల్కొని వుంటారు.
ఆలోచనలు తీగలు తీగల్లా వస్తూ వుంటాయి. తెగిపోతూ మళ్లీ పుడుతూ. పాజిటివ్‌గా ఆలోచిస్తే లాభం లేదు. ఆ దిశగా ప్రయాణం చేయాలి. సంఘటనల్లో మంచీచెడు వుంటాయి. చెడు జరిగింది కదా అని దాన్నే ఆలోచిస్తే తుపానును తప్పించుకోడానికి ఇంకో తుపానులోకి వెళ్లడమే. ఎంత గొప్ప కెప్టెన్ అయినా గాలి అనుకూలంగా వీచాలి. గాలి ప్రతికూలంగా ఉన్నపుడు నౌకని సురక్షితం చేయడమే నిజమైన కెప్టెన్సీ. ఒక చిక్కు ముడిని విప్పుతున్నప్పుడు ఇంకొకటి తయారవుతుంది. దీన్ని ఒక ఆటగా చూడాలి. గేమ్‌లో కొన్నిసార్లు గెలుస్తాం, ఓడతాం. ఓడిన వాళ్లు మళ్లీ ఆడాలి. ఆడకపోతే వాడు ఆటగాడే కాదు.
పిచ్చి పట్టిన గుర్రంలా మనసు మారిపోతే అది రౌతుని కిందపడేసి కాళ్లతో తొక్కేస్తుంది. ఆ గుర్రాన్ని ఆ స్థితికి మనమే చేర్చాం. సరైన శిక్షణ లేక ఉన్మాదిలా వ్యవహరిస్తుంది. ఎంత గొప్ప అరబ్బీ గుర్రానికైనా కళ్లెం వేసి జీను వేస్తేనే రేసు గుర్రంలా మారుతుంది. పరుగులు తీయడమే దాని జీవశక్తి. అయితే ఎప్పుడూ పరిగెత్తే గుర్రం తొందరలోనే ఎగశ్వాసతో చచ్చిపోతుంది. జీవించాలంటే పరుగు ఎక్కడ ఆపాలో తెలియాలి. కానీ మనిషికి అహం. అందరూ తనని గుర్తించాలనే అహం. గొప్ప వాళ్లు కూడా అపరిచిత ప్రదేశంలో తమని ఎవరైనా గుర్తు పట్టి పలకరిస్తే ఆనంద పడిపోతారు. ఉద్యోగం, పదవితో వచ్చే గౌరవాలు వాటంతటవే మాయమైపోతాయి. గత కాలపు వైభవం కోసం మనుషులు తాపత్రయ పడి వెతుక్కుంటారు….వృథా ప్రయాసని తెలిసినా. నువ్వు గడ కర్రపై ఆడినంత కాలం చప్పట్లు కొడతారు. కింద పడితే ఆట ముగిసిందని వెళ్లిపోతారు… ఇదే లోకం.