Idream media
Idream media
అవును.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యావత్ దేశాన్ని ఎడమ చేత్తో నడిపించేస్తున్నారు. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తన ఎడమ చేతి వేళ్ల మధ్య తీసేసుకుంటున్నారు. ఏంటి ఈ ఎడమ చేతి కథ అనుకుంటున్నారా…, అదేనండి ఈ రోజు లెఫ్ట్ హ్యాండర్స్ డే. దానికి, మోదీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా… ఆయనది కూడా ఎడమ చేతివాటమేనండి. భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించిన ఎన్నో నిర్ణయాలు ఆయన ఎడమచేతితో పెట్టే సంతకంతోనే అమల్లోకి వస్తున్నాయి. మోదీయే కాదు.. ఎంతో మంది రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులది ఎడమ చేతివాటమే.
లెఫ్ట్ హ్యాండర్స్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పలువురి ప్రముఖులను చూస్తే నిజమే అనిపిస్తుంది. ప్రపంచ జనాభాలో 10 శాతం ఎడమ చేతివాటం (లెఫ్ట్ హ్యాండర్స్) ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఎడమ చేతిని అధికంగా ఉపయోగించేవారిలో ఐక్యూ ఎక్కువగా ఉండి కళా, క్రీడా రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరచి విశేష ఖ్యాతినర్జిస్తారనే పేరు ఉంది. ఇది జన్మతహః వస్తుంది. ఆగస్టు 13 ప్రపంచ వ్యాప్తంగా లెఫ్ట్ హ్యాండర్స్ డేగా వేడుకలు నిర్వహిస్తారు. 1976లో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.
జాతిపిత మహాత్మాగాంధీ నుంచి నేటి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు చాలా మంది ప్రముఖుల్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం విశేషం. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి, ప్రముఖ పారిశ్రామివేత్త రతన్ టాటా, సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్, సినీ నటులలో అమితాబ్ బచ్చన్, మహానటి సావిత్రి, అలనాటి హాస్యనటి సూర్యకాంతం ఈ కోవలోకే వస్తారు. క్రికెట్ రంగంలో సౌరబ్ గంగూలీ, శిఖర్ దావన్, యువరాజ్ సింగ్ తదితరులు, ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు మైఖల్ జాక్సన్, హాస్యనటుడు చార్లీ చాప్లిన్, ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారిడోనా, టెన్నిస్ రంగంలో అత్యధిక టైటిల్స్ సాధించింది వీరే కావడం విశేషం. రాజకీయ, క్రీడా, కళా రంగాలలో ఎడమ చేతివాటం వారు తమ ప్రతిభ చాటి విశేష ఖ్యాతినార్జించారు. అమెరికా అధ్యక్ష పదవి అధిరోహించిన రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, ఒబామాలు లెఫ్ట్ హ్యాండర్సే.
భారత సాంప్రదాయంలో కుడికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. నూతన గృహ ప్రవేశం మొదలు పలు వేడుకల్లో కుడి కాలు మొదట పెట్టమని చెబుతుంటారు. కొత్త కోడలు కుడి కాలు ముందు పెట్టి ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా నగదు లావాదేవీలన్నీ కుడిచేతితోనే సాగిస్తారు. గుడిలో తీర్థ ప్రసాదాలు కుడి చేతితో స్వీకరిస్తారు. దీంతో సాంప్రదాయ పద్ధతుల్లో తేడాలు వస్తున్నాయని ఎడమ చేతి వాటం వారు వాపోతుంటారు. కుడి చేతి ప్రపంచంలో వంటింట్లో గ్యాస్ స్టౌ నుంచి కంప్యూటర్ మౌస్ వరకు వారికే అనుకూలంగా చేసుకున్నారని ఎడమచేతి వాటం వారి ఆవేదన.
– నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా….