కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఏ పార్టీలో ఉన్నారు..?

ఎమ్మెల్యే అయిన కొద్ది నెలలకే చుట్టిముట్టిన కేసులతో టీవీ రామారావు రాజకీయ పయనం ఒడిదుడుకులకు లోనైంది. ఈ క్రమంలోనే ఆయనకు టీడీపీ టిక్కెట్‌ మళ్లీ దక్కలేదు. 2014లో టిక్కెట్‌ దక్కకపోయినా టీడీపీ విజయానికి పని చేసిన రామరావు.. 2019లో టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. అయితే ఈ సారి కేఎస్‌ జవహర్‌ బదులు.. ఆ స్థానాన్ని వంగలపూడి అనితకు చంద్రబాబు కేటాయించడంతో టీవీ రామారావు భంగపడ్డారు. ఈ క్రమంలో మీడియా సాక్షిగా టీడీపీ కండువాను, పసుపు చొక్కాను తీసివేసి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు తనను వాడుకుని వదిలేశాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన చేరినట్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా కొవ్వూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఓ కేసు విషయంలో ఆయన బయటకు వచ్చారు. పెనకనమెట్ల గ్రామంలో ఫ్లెక్సీ విషయంలో వివాదం రాజుకుని రెండు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. దళితులపై డాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీకి వినతిపత్రం అందించారు. ఈ సమయంలో ఆయన వైసీపీ కండువా వేసుకోలేదు. తాను ఫలానా పార్టీ తరఫున వచ్చానని చెప్పలేదు.

Also Read : వెంకయ్యనాయుడుకి రాష్ట్రపతిగా అవకాశం వస్తుందా?

తొలిసారిగా ఎమ్మెల్యే అయిన కొద్ది నెలలకే టీవీ రామారావు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయనపై నమోదైన అత్యాచారం, హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిడదవోలు పట్టణంలో టీవీ రామారావు సృహ నర్సింగ్‌ కాలేజీ నిర్వహించేవారు. ఆ కాలేజీలో ఇతర రాష్ట్రాల విద్యార్థినిలు చదువుకునేవారు. ఈ క్రమంలో 2009లో కాలేజీలో కేరళకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై రామారావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐదుగురు కేరళ విద్యార్థులపై ఆయన అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలపై అత్యాచారం, హత్య కేసు నమోదయ్యాయి. సీఐడీ విచారణ జరిగింది. కాలేజీని సీజ్‌ చేశారు. అరెస్ట్‌ అయిన రామారావు ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుపై అసెంబ్లీలోనూ చర్చించారు. కోర్టులో బెయిల్‌ రాని సమయంలో టీవీ రామారావు సృహతప్పిపడిపోయిన ఘటనను నాటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య నటించి చూపి రామారావు వ్యవహరించిన తీరును తనదైన శైలిలో ఎండగట్టారు.

ఈ కేసు నేపథ్యంలోనే రామారావుకు 2014లో టిక్కెట్‌ దక్కలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కేఎస్‌ జవహర్‌కు టీడీపీ టిక్కెట్‌ దక్కింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన జవహర్‌.. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పదవి దక్కించుకున్నారు. 2019లో కృష్ణా జిల్లా తిరువురు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొవ్వూరులో వంగలపూడి వనిత పోటీ చేసి ఓటమిచవిచూశారు. వైసీపీ తరఫున తానేటి వనిత రెండో సారి పోటీ చేసి గెలిచారు. జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో రామారావుకు కేసు నుంచి విముక్తి లభించింది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే ఆగస్టులో రామారావుపై నమోదైన అత్యాచారం, హత్య కేసులను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకుంది. రామారావుపై నమోదైన అభియోగాలకు ఆధారాలు లేవని, ఆ కేసులను కేవలం వేధింపుల కేసుగా మార్చి, అసత్య ఆరోపణలు చేశారంటూ కేసులను విరమించుకుంది. కేసులు ఎత్తివేయడంతో 2019లో తనకు టిక్కెట్‌ వస్తుందని రామారావు ఆశించినా అది జరగలేదు. దీంతో ఆయన టీడీపీని వీడారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నానని చెబుతున్న రామారావు.. భవిష్యత్‌ రాజకీయ పయనం ఎలా సాగుతుందో వేచి చూడాలి.

Also Read : చేసిన పని మరిచిపోయారా బాబూ..?

Show comments