Idream media
Idream media
తెలంగాణ కాంగ్రెస్ దూకుడుగా వెళ్లబోతుందనే లోపు మళ్లీ బ్రేక్ పడుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూసుకెళ్దాం అనుకునే లోపు ఎవరో ఒకరు వెనక్కి లాగేస్తున్నారు. కాంగ్రెస్ లో అసలేం జరుగుతుందో, సీనియర్ల మధ్య ఈ సయ్యాటలేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కావాలని చేస్తున్నారా, వీలుకాక చెబుతున్నారో అర్థం కావడం లేదు. అసలు ఈ సోదంతా ఎందుకో మీకు అర్థం కావాలంటే ఇది చదవాల్సిందే.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ఓ ప్రహసనంగా సాగిన విషయం తెలిసిందే. చివరికు ఎలాగోలా అనుకున్నది సాధించిన రేవంత్ సీనియర్ల పట్ల విధేయంగా, కేసీఆర్ పట్ల వీరావేశం ప్రదర్శిస్తూ ఆరంభం అదుర్స్ అనిపించారు. అయితే, వీహెచ్ వంటి సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు ఇప్పటికీ దూరంగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫోన్ చేయడం సంచలనం రేపింది. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోన్న దళిత దండోరా సభను వాయిదా వేసుకోవాలని కోమటిరెడ్డి కోరడం చర్చనీయాంశమైంది. ఈ నెల 18న పార్లమెంటరీ స్టడీ టూర్కు వెళ్లాల్సి ఉన్నందున సభకు తాను హాజరు కాలేనని వెల్లడించడం వివాదాస్పదంగా మారింది.
టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి బాహాటంగానే తన అసమ్మతిని వెళ్లగక్కారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడంపై నిప్పులు చెరిగారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావంటూ శాపనార్ధాలు పెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ పదవిని అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేసి పార్టీ నాయకత్వాన్ని ఇరుకునపెట్టారు. ఇప్పటికీ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉన్నప్పటికీ కొంత ఆచితూచి ముందుకెళ్తున్నారు కోమటిరెడ్డి. గాంధీ భవన్ మెట్లెక్కనని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. వెళ్లాల్సిన అవసరం లేదన్నానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇటీవల రేవంత్ రెడ్డి దళిత, గిరిజన దండోరా పేరుతో చేపట్టిన ఇంద్రవెళ్లి సభకు కూడా కోమటిరెడ్డి సహా చాలా మంది సీనియర్లు గైర్హాజరయ్యారు. దీంతో ఇంకా టీపీసీసీ మంటలు చల్లారలేదన్న వాదనలు వినిపించాయి.
అయితే ఇంద్రవెళ్లి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇబ్రహీంపట్నంలో మరో సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ఆరోజే ప్రకటించారు. అక్కడే చిక్కొచ్చి పడినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో అక్కడ సభ ఏర్పాటు చేస్తే కోమటిరెడ్డి సహకరిస్తారా? లేక హాజరుకాకుండా దూరంగా ఉంటారా? అనే అనుమానాలు లేవనెత్తాయి. ఒకవేళ ఆయన హాజరుకాకుంటే సభ కంటే కూడా కోమటిరెడ్డి రాలేదన్న ప్రచారమే జనాల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ శ్రేణులు అంచనాలు వేస్తున్నాయి.
ఇంతలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఊహించని షాకిచ్చారు. ఆయన నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సభ వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. రేవంత్‌కి ఫోన్ చేసిన కోమటిరెడ్డి ఇబ్రహీంపట్నం సభను వాయిదా వేయాలని రిక్వెస్ట్ చేశారని టాక్. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఈ నెల 17 నుంచి 21 వరకూ స్టడీ టూర్‌కి వెళ్లాల్సి ఉందని.. అందువల్ల తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించ తలపెట్టిన సభను వాయిదా వేయాలని కోరినట్లు సమాచారం. మరి రేవంత్ ఎలా రియాక్ట్ ఏం చెప్పారో తెలియదు కానీ ఇబ్రహీంపట్నం సభకు పోలీసులు అనుమతులు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో మహేశ్వరం నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.