రేవంత్ దూకుడుకు సొంత పార్టీ ఎంపీ స్పీడ్ బ్రేకర్

ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ వేదికపై నుంచి మరో సభకు ప్రకటన చేశాడు. ఎక్కడ జరుగుతుందో కూడా చెప్పేశాడు. సాధారణంగా అయితే ఆ ప్రాంతం పరిధిలోని అదే పార్టీకి చెందిన ఎంపీ ఏం చేస్తాడు. తాను సైతం సభ సక్సెస్‌ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తాడు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ రచ్చ ఆ సభతోనే ఆగేలా కనిపించడం లేదు. దీనిపై తీవ్రమైన చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సభకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాలేనడం, అదే ప్రాంతానికి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభకు హాజరుకాకపోతే పార్టీకి జరిగే డ్యామేజ్‌ ఊహించుకుని సభా వేదికను మార్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంఘటన మాత్రం టీకాంగ్రెస్‌లో చిచ్చు రాజేస్తోంది. దీన్ని అవకాశంగా మార్చుకుని రేవంత్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది.

ఆది నుంచీ వివాదాలే

టీ.కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి, కోమటిరెడ్డికి మధ్య జరుగుతున్న పోరుపై అధికారపక్షం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బహిరంగ వేదిక ద్వారా అధ్యక్షుడు చేసిన ప్రకటనకు సొంత పార్టీ నేతలే కట్టుబడి ఉండని నేపథ్యంలో ఆయనకు కేసీఆర్‌ను విమర్శిస్తూ మాట్లాడే అర్హత ఉందా అనే ప్రశ్నను అధికార పక్షం నేతలు లేవనెత్తుతున్నారు. ఈ సభ మార్పు ద్వారా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, రేవంత్‌ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని తేలడమే ఇందుకు కారణం. ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై చేసిన సర్వే కూడా పార్టీని ఇరకాటంలో పెట్టేసింది. ఇవన్నీ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తున్నాయి.

మొదటి నుంచి పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. యువజన కాంగ్రెస్‌ మొదలు రాష్ట్ర కాంగ్రె్‌సలో కీలక పదవులతోపాటు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎంపీగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ జెండాను వీడలేదు. ఆర్థికంగా పార్టీని ముందుకు నడిపే శక్తి కోమటిరెడ్డి సోదరులకు కూడా ఉంది. దీంతోపాటు పార్టీ పెద్దలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారి ఆశీస్సులు ఉన్నాయి.

అన్ని సభలకూ కోమటిరెడ్డి దూరం

పీసీసీ చీఫ్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా అనూహ్యంగా పీసీసీ చేజారడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా ప్రకటన వెలువడిన రోజే పదవులు అమ్ముకున్నారంటూ వెంకట్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అధిష్ఠానం సీరియస్‌ కావడంతో మరుసటి రోజే తాను నియోజకవర్గంలో ప్రజాసేవకే పరిమితమవుతానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌కు పార్టీ పెద్దలంతా సహకరించాలని అధిష్ఠానం ఆదేశించింది. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు మంచి స్పందన కనిపించింది. ఇంద్రవెల్లి సభకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇందిరా పార్కు వద్ద ముస్లిం మైనారిటీల సభ ఏర్పాటు చేయగా దీనికి సైతం వెంకట్‌రెడ్డి దూరంగానే ఉన్నారు.

అధిష్ఠానానికి ఫిర్యాదులు

పీసీసీ ఆధ్వర్యంలో రెండో ఆత్మగౌరవ దండోరా సభ ఇబ్రహీంపట్నంలో ఉంటుందని ఈనెల 9న ఇంద్రవెల్లి సభా వేదికపై నుంచే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తనకు సమాచారం ఇవ్వకుండా, తనను కనీసం సంప్రదించకుండా తన పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నంలో సభ ఎలా ప్రకటిస్తారని కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ తీరుపై పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో ఆయన కోమటిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. అనంతరం కోమటిరెడ్డి, రేవంత్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారని, తనకు ఈనెల 17 నుంచి 21 వరకు బొగ్గు, స్టీల్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో స్టడీ టూర్‌ ఉన్నందున సభకు రాలేనని, ఆ టూర్‌ కోసం గోవాకు వెళ్తున్నానని కోమటిరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.

మార్పు అందుకోసమేనా..?

రేవంత్‌ రెడ్డి టీపీసీసీ చీఫ్‌ అయ్యాక ఏర్పాటు చేసిన రెండు సభలకు కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో సభ పెట్టి స్థానిక ఎంపీ కోమటిరెడ్డి హాజరుకాకపోతే అంతర్గతంగా పార్టీలో సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే సభాస్థలి మార్చాలని నిర్ణయించారని, ఇందుకు ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ పరిస్థితులన్నీ సీనియర్‌ నేతలకు కేంద్రమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త అధ్యక్షుడు రేవంత్‌ ఎదురీదక తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. మొదట ఖరారు చేసిన సభను కొత్త అధ్యక్షుడు మరో ప్రాంతానికి మార్చుకునే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో రేవంత్‌ మున్ముందు ఎంతలా మారాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments