Idream media
Idream media
హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ను బరిలో నిలపడానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఉద్యమ కాలంలో పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లారు. ఉద్యమ నేతగా చెప్పుకుని ప్రచారం చేస్తున్న ఈటల రాజేందర్ కు పోటీగా మరో ఉద్యమ నేతను పెట్టడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడం కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే, ఈటలను ఢీకొనేందుకు ఉద్యమ నేపథ్యం ఉన్న యువనేతను అభ్యర్థిగా ఎంపిక చేయడమే మంచిదని టీఆర్‌ఎస్ అధినాయకత్వం నిర్ణయించింది. ఉద్యమ కాలం నుంచీ టీఆర్‌ఎస్వీలో పనిచేస్తూ వస్తున్న, ఉద్యమంలో భాగస్వామ్యమూ ఉన్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరును ఖరారు చేసింది. దీంతో పాటు కేసీఆర్ మొదటి నుంచీ విద్యార్థి సంఘాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారి గెలుపు కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పలువురు విద్యార్థి సంఘాల నేతలు ఎంపీ, ఎమ్మెల్యేలు అయ్యారు. మరి కొందరు కీలక పదవుల్లో ఉన్నారు. పార్టీ అనుబంధ విద్యార్ధి సంఘమైన టీఆర్‌ఎస్వీ నేతలకు పదవుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో భాగంగానే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించి మరోసారి విద్యార్థి సంఘం నేతలకు పెద్దపీట వేశారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన బాల్క సుమన్ 2014లో పెద్దపల్లి ఎంపీగా, 2018లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
టీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శిగా పని చే సిన గ్యాదరి కిషోర్ 2014, 2018లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009లో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2005లో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా పనిచేసిన బొంతు రామ్మోహన్, 2016లో కార్పొరేటర్‌గా గెలిచి జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఐదేళ్లు పనిచేశారు. టీఆర్‌ఎస్వీ నగర అధ్యక్షుడిగా పని చేసిన బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్‌గా గెలిచి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఇంకా పలువురు నేతలకు సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఓయూలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రచారానికి విద్యార్థులు, యువత కలిసి వస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.