Idream media
Idream media
‘‘అవును.. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఉన్నందుకే దళిత బంధు పథకాన్ని అక్కడ పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నం. ఎన్నికలున్నందుకే అక్కడ పెట్టినం. మరి పెట్టమా? టీఆర్‌ఎస్ ఏమైనా సన్నాసుల పార్టీయా? రాజకీయ పార్టీయే కదా? టీఆర్‌ఎస్‌కు అధికారం ఉంటేనే కదా దళిత బంధు నడిపేది! మనమేమైనా హిమాలయ పర్వతాల్లో కూర్చున్నమా? ప్రజల్లో ఉన్నం.. కచ్చితంగా మనది రాజకీయ పార్టీ. పథకం పెట్టినప్పుడు రాజకీయంగా లాభం జరగాలని ఎందుకు కోరుకోము?’’ ఎన్నికల కోసమే దళిత బంధు ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం చెప్పారు కేసీఆర్. ఈరోజు అక్కడ సభ పెడుతున్నారు. పథకం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ ఉన్న జిల్లా. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. మొట్టమొదటి సింహగర్జన సభ కూడా అక్కడే జరిగింది. అంతేకాదు.. రైతుబంధు పథకాన్ని కూడా హుజూరాబాద్‌లోనే ప్రారంభించారు. రైతుబీమా పథకాన్ని కూడా కరీంనగర్ టౌన్‌లోనే ప్రకటించారు. ఇప్పుడు దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు కేసీఆర్ సోమవారం హుజూరాబాద్‌కు వెళ్తున్నారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇంద్రానగర్‌లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని కొందరు లబ్ధిదారులకు దళితబంధు పథకం చెక్కులను నేరుగా అందజేస్తారు. అనంతరం కేసీఆర్ మాట్లాడతారు.
ఈ సభకు టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగానే సన్నాహాలు చేశారు. ఇటీవల ప్రవీణ్‌కుమార్, రేవంత్ రెడ్డిలు నిర్వహించిన సభలు సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరవై ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు. లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ మరింత యాక్టివ్ అయ్యారు. పర్యటనలు, సమీక్షలు నిర్వహిస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఒకసారి సమాధానం చెప్పిన కేసీఆర్.. మరోసారి నేడు హుజూరాబాద్ వేదికగా స్వరం పెంచనున్నారు.
హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వపరంగా సభ నిర్వహిస్తున్నా.. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇది రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ ఎపిసోడ్ తర్వాత హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ తొలిసారి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ప్రజలకు పరిచయం చేయనున్నట్లూ చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్.. టీఆర్‌ఎస్ ప్రచారంలో పాలుపంచుకొంటుండగా.. సీఎం పర్యటనతో ఈ ప్రచారం మరింత వేడెక్కే అవకాశం ఉంది.