Idream media
Idream media
రాజు తలుచుకుంటే వరాలకు కరువా..! ఇవ్వాలనుకుంటే నిబంధనలు అడ్డంకా..!! హుజూరాబాద్ నియోజకవర్గం విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయాలు చేస్తాం.. తప్పేం ఉందంటూ పేర్కొన్న కేసీఆర్.. ఓ నియోజకవర్గంలో అమలు చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ సర్కార్.. హుజూరాబాద్ కోసమే ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటుండడం గమనార్హం.
రాష్ట్రంలో ఎక్కడా కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. మీ సేవా కేంద్రాల్లో ఆసలు ఆ వెబ్ సైటే పని చేయడం లేదు. జూన్ 9 నుంచి ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. కానీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఆ నియోజకవర్గం పరిధిలోని మీసేవ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా అందించింది.
అలాగే.. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా చేసుకున్న దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన 2వేలకు పైగా దరఖాస్తులను మాత్రం వెంటనే ఆమోదిస్తూ పింఛన్లు మంజూరు చేశారు.
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇంత వరకు విధి విధానాలే ఖరారు కాలేదు. కానీ, హుజూరాబాద్‌లో కొత్త అర్హత వయసుతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
మహిళా సంఘాలకు ఇప్పిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను ప్రభుత్వం మూడేళ్లుగా విడుదల చేయడంలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం అన్ని మండలాల్లోని మహిళా సంఘాలకు ఈ బకాయిలను విడుదల చేసింది. కమలాపూర్ మండలంలో మహిళలకు రూ.8.12 కోట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవలే పంపిణీ చేశారు.
ఇలా.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో హుజూరాబాద్ వేరయా అన్నట్లుగా కేసీఆర్ సర్కార్ ప్రత్యేక ప్రేమను చూపుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పెండింగ్‌లో ఉన్న పథకాలు.. ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌లో మాత్రం చకచకా అమలవుతున్నాయి. నిధులు వేగంగా మంజూరవుతున్నాయి. ఈ నియోజకవర్గంపై వరాల వాన కురిపిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కూడా పైలట్ ప్రాజెక్టు పేరుతో అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. వాటికి కొనసాగింపుగా.. పెండింగ్‌లో ఉన్న పలు పథకాల అమలును తిరిగి ప్రారంభిస్తుండటంతోపాటు పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నారు. వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తున్నారు.
Also Read : కేటీఆర్ ఉద్యమంలోకి వెళ్ళటానికి, ఢిల్లీ యూనివర్సిటీకి ఉన్న సంబంధం తెలుసా?
వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల కోసం అరవై ఐదు ఏళ్ల పైబడినవారు, వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు ఐదు లక్షలకు పైగా అందగా, వీటిలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవి రెండు వేల వరకు ఉన్నాయి. అయితే 118 నియోజకవర్గాల దరఖాస్తులను పక్కనబెట్టి.. హుజూరాబాద్ నియోజకవర్గంలో దరఖాస్తు చేసినవారందరికీ పింఛన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో హుజూరాబాద్ మండలంలోని 669 మందికి పింఛన్ల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు దరఖాస్తుదారులకు సమాచారం అందించారు. అంతేకాదు.. ఐదు మండలాల్లో కొత్తగా ఎవరున్నా వెంటనే దరఖాస్తు చేసుకోండంటూ అధికారులే ప్రచారం చేస్తున్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను మూడేళ్లుగా విడుదల చేయడం లేదు. దీంతో ఆ రుణాలకు సంబంధించిన వడ్డీలను మహిళలే బ్యాంకులకు చెల్లించాల్సి వస్తోంది. వడ్లీ లేకుండా ఇస్తామంటే రుణాలు తీసుకున్నామని, మూడేళ్లుగా ఆ వడ్డీని తామే చెల్లించాల్సివస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. గత ఆర్థిక సంవత్సరం వరకు మూడేళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,720 కోట్ల 19 లక్షల 18 వేల రూపాయల వడ్డీ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇతర చోట్ల ఈ ఊసే ఎత్తని ప్రభుత్వం.. హుజూరా బాద్ నియోజకవర్గంలో మాత్రం ఈ బకాయిలను విడుదల చేసింది.
ఇక వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినా.. కొత్త దరఖాస్తుల స్వీకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం అన్ని గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉప ఎన్నికకు ముందే వీటిని మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంలేదు. అయితే దరఖాస్తు చేసిన వారందరికీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకుంది. అప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించినవారి సంఖ్య 4,15,901గా ఉంది. వీరిలో 3,09,082 మందిని అర్హులుగా గుర్తించింది. జూలై 26న రేషన్‌కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించి జూలై 31న ముగించింది. అయితే కొత్త కార్డుల కోసం మీసేవ కేంద్రాలు దరఖాస్తులు స్వీకరించకుండా జూన్ 9 నుంచే నిషేధం విధించింది. దీంతో ఇంకా అర్హులు ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ, హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని మీసేవ కేంద్రాల్లో మాత్రం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఆపరేషన్ హుజూరాబాద్ లో భాగంగా ఇంత పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తున్న గులాబీ బాస్ అక్కడ సత్తా చాటగలరా? లేక తానిచ్చిన షాక్ తోనే హుజూరాబాద్ ప్రజలకు ప్రభుత్వం వరాలు అందిస్తోందని ప్రచారం చేసుకుంటున్న ఈటల రాజేందర్ గెలుస్తారా..? ఏదేమైనా ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలకూ భిన్నంగా ఓ ఉప ఎన్నిక ప్రచారం జరుగుతుండడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
Also Read : బీజేపీ ఎత్తు.. టీఆర్‌ఎస్ పైఎత్తు..