iDreamPost
android-app
ios-app

సూర్యగ్రహణం రోజు అంగవైకల్యం పోతుందని పాతేసారు..

సూర్యగ్రహణం రోజు అంగవైకల్యం పోతుందని పాతేసారు..

ఆధునిక యుగంలో ఉన్నామన్న పేరే కానీ, ఇంకా మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలని నమ్ముతున్న ప్రజలు దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇంకా దేశంలో మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ప్రజల్లో మూఢ నమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఈరోజు సూర్య గ్రహణం సందర్భంగా మూఢ నమ్మకంతో కొందరు తల్లిదండ్రులు చేసిన పని వల్ల పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని విజయాపూర్ జిల్లా కల్బుర్గీలో తమ మూఢ నమ్మకాలతో తమ పిల్లలని ఇబ్బందులు పెట్టారు కొందరు తల్లిదండ్రులు. తమ పిల్లలకు ఉన్న వైకల్యం పోవాలంటే సూర్యగ్రహణం సంమయంలో మెడలోతు వరకూ భూమిలో పాతిపెట్టాలని భూత వైద్యులు సలహా ఇవ్వడంతో ఆ సలహాని పాటించిన తల్లిదండ్రులు గొయ్యి తవ్వి తమ పిల్లలని ఆ గొయ్యిలో ఉంచి మెడలోతు వరకు మట్టితో కప్పేశారు. పిల్లలు బాధతో ఏడుస్తున్నా తల్లిదండ్రులు కరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ పిల్లలను శిరస్సు వరకూ పాతి పెట్టిన చోటుకు చేరుకొని ఆ ఘటనపై విచారణ చేపట్టారు.

తమ పిల్లలు అంగవైకల్యంతో బాధ పడటం ఏ తల్లిదండ్రులు చూడలేరు. కానీ ఇలా శాస్త్రీయ నిరూపణ లేని మూఢ నమ్మకాల ద్వారా తమ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఒరిగేదేమి ఉండదు. ఈ ఆధునిక యుగంలో కూడా ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలవన్న నిజాన్ని కొందరు గ్రహించకుండా ఇంకా మూఢ విశ్వాసాలతో బ్రతుకుతూ ఉండటం ఆందోళన చెందాల్సిన విషయమే.