“పోతుల ” రీఎంట్రీతో కందుకూరులో ఏం జరగబోతోంది..?

సాధారణ ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు.. మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే టీడీపీ నియోజకవర్గ శ్రేణులకు సంకేతాలు పంపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పోతుల రామారావు.. వైసీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల తర్వాత రెండు నెలలు అడపాదడపా నియోజకవర్గంలో కనిపించిన పోతుల.. ఆ తర్వాత కనుమరుగయ్యారు. అనారోగ్య సమస్యలు వెంటాడడంతో హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు.

దాదాపు రెండేళ్ల తర్వాత ఈ నెల 11వ తేదీన పోతుల రామారావుస్వగ్రామం టంగుటూరుకు వచ్చారు. తాను వస్తున్నట్లు ముందుగానే తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా నియోజకవర్గ ద్వితియ శ్రేణి నేతలకు సమాచారం అందించారు. పలువురు నేతలు వెళ్లి పోతుల రామారావును కలిశారు. మరో వారం పది రోజుల్లో నియోజకవర్గానికి వస్తానని, ఇకపై పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని నేతలకు పోతుల రామారావు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

రెండేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నా.. ఇంఛార్జిగా పోతుల రామారావునే టీడీపీ అధిష్టానం కొనసాగించింది. మధ్యలో పలుమార్లు కొత్త ఇంఛార్జిని నియమించాలని స్థానిక నేతలు కోరినా టీడీపీ అధిష్టానం స్పందించలేదు. అయితే ఈ రెండేళ్లు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. ఇటీవల మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పోతుల రామారావు ఇక రారని ఆశించి.. పార్టీ బాధ్యతలు చూస్తున్న శివరాంకు తాజాగా పరిణామం మింగుడుపడడం లేదు.

Also Read : తోట త్రిమూర్తుల స్థానాన్ని భర్తీ చేసిన టీడీపీ .. రామచంద్రాపురంలో ఆసక్తికర పోరు..!

పోతుల రామారావు స్థానికేతరుడు. పక్కనే ఉన్న కొండపి నియోజకవర్గం ఆయనది. దివి శివరాం స్థానికుడు. కందుకూరు నుంచి 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. మానుగుంట మహీధర్‌రెడ్డికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్నారు. 2004, 2009లో మహీధర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో మహీధర్‌ రెడ్డి పోటీకి దూరంగా ఉండగా.. వైసీపీ తరఫున పోతుల రామారావు టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. మూడు సార్లు ఓడిపోయిన దివి శివరాంను 2019లో పక్కనపెట్టిన చంద్రబాబు.. పోతుల రామారావును అభ్యర్థిగా బరిలోకి దించారు. అయినా విజయం వరించలేదు.

శివరాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నేతలు విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయించేవారు. ముఖ్యంగా కందుకూరు పట్టణంలో టీడీపీ నేతల రుబాబు ఎక్కువగా ఉండేది. రాజకీయ ప్రత్యర్థులపై నిత్యం కేసులు పెట్టి వేధించేవారు. ఈ పరిణామాల వల్ల దివి శివరాంపై కందుకూరు పట్టణంలో వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో మహీధర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేవి. ఈ పరిణామాలతో ప్రశాంతతను కోరుకునే పట్టణ వాసులు, వ్యాపారులు మహీధర్‌ రెడ్డికి మద్ధతు తెలిపేవారు. ఫలితంగా కమ్మ సామాజికవర్గం ఎక్కవగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో శివరాం కొంత ఆధిక్యం సాధించినా.. పట్టణంలో మహీధర్‌ రెడ్డికి వచ్చే మెజారిటీ దాన్ని సమం చేసేది. మహీధర్‌ రెడ్డి సొంత గ్రామం మాచవరంలో ఒన్‌సైడ్‌ ఓటింగ్‌ జరిగేది. దాదాపు ఐదు వేల ఓటింగ్‌ ఉన్న మాచవరం మహీధర్‌ రెడ్డికి హృదయం లాంటిది. మాచవరం, కందుకూరు పట్టణంలో వచ్చే మెజారిటీతోనే మహీధర్‌ రెడ్డి అన్నిసార్లు విజయం సాధించారు.

తాజా రాజకీయ పరిస్థితుల్లో పోతలు రామారావు మళ్లీ యాక్టివ్‌ అయితే.. శివరాం పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. టీడీపీ అధిష్టానం కూడా పోతుల రామారావుకే మద్ధతుగా ఉన్న నేపథ్యంలో.. మళ్లీ కందుకూరు టీడీపీలో పోతులదే ఆదిపత్యం నడవబోతోంది. అయితే శాంతి భద్రతలు కాపాడడం, నియోజవర్గంలో శాశ్వత అభివృద్ధి పనులు చేయడంలో జిల్లాలోనే ఎవరికీ అందనంత ఎత్తులో ఉండే మహీధర్‌ రెడ్డిని ఆర్థికంగా బలవంతుడైన పోతుల రామారావు ఢీ కొట్టగలరా..? అనేది కాలమే తేల్చాలి.

Also Read : కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఏ పార్టీలో ఉన్నారు..?

Show comments