సుప్రీంలో భారీ ఊరట : టూర్ కు గాలి జనార్దన్ రెడ్డి రెడీ..!

ఓబుళాపురం మైనింగ్ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్నాటక బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన్ను స్వస్ధలం బళ్లారితో పాటు ఏపీలోని కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది.

1999 వరకు జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు సోమశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన చిట్‌ఫండ్ కంపెనీ ఎన్నోబుల్ ఇండియా సేవింగ్స్ కుప్పకూలిన తర్వాత రూ. 200 కోట్లకు పైగా అప్పులు మిగిలాయి. కర్ణాటక కేబినెట్‌లో ప్రస్తుత మంత్రి బి శ్రీరాములు గాలి జనార్ధన్‌రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. పార్టీకి నమ్మకమైన శ్రీరాములుకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినప్పుడు, రెడ్డి, ఆయన సోదరులు బిజెపిలో చేరారు.

సుష్మాస్వరాజ్‌కి సన్నిహితులు కావడంతో రెడ్డి సోదరుల ఈ ఎత్తుగడ వారికి రాజకీయ రంగంలో పెద్ద ఊపునిచ్చింది. 1999 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సుష్మాస్వరాజ్ బళ్లారిలో పోటీ చేశారు. సుష్మా స్వరాజ్ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ రెడ్డి సోదరులు,శ్రీరాములు స్వరాజ్‌కి చాలా దగ్గరయ్యారు. కర్ణాటక బీజేపీ నాయకులతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు.

2008లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జనార్దన్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. బళ్లారికి చెందిన రెడ్డి సోదరులు తొలిసారిగా ఆపరేషన్ కమల (ఆపరేషన్ కమలం) ప్రారంభించారు. 2008లో గాలి జనార్ధన్ రెడ్డి సహకారంతో యడ్యూరప్ప మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. చట్టాన్ని రూపొందించే వ్యక్తుల గుర్రపు వ్యాపారాన్ని జనార్ధ రెడ్డి నడిపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టర్న్‌కోట్‌లను పొందగలిగారు. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ.. అసెంబ్లీలో 112 సీట్ల సాధించి మెజారిటీకి మూడు సీట్లు దూరంలో ఆగిపోయింది. మూడు సంవత్సరాల తరువాత 2011లో, జనార్దన్ రెడ్డిని అక్రమ మైనింగ్ ఆరోపణలపై సీబీఐఅరెస్టు చేసింది. ఆయన 2015లో బెయిల్ పొందినప్పుడు బళ్లారి జిల్లాను సందర్శించకుండా నిషేధం విధించారు. అప్పటి నుండి, ఆయన బళ్లారిలో ఉండడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దాదాపు దశాబ్దం పాటు బళ్లారిని జనార్దన్ రెడ్డి పాలించారు.

2001లో, రెడ్డి రూ. 10 లక్షల ప్రారంభ మూలధనంతో ఓబలాపురం మైనింగ్ కంపెనీని ప్రారంభించారు. 9 సంవత్సరాలలోపు కంపెనీ టర్నోవర్ రూ .3000 కోట్లకు పైగా ఉంది. ఆయన తన రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుని భారీ స్థాయిలో అక్రమాలకు పాలపడ్డారని అభియోగాలు ఉన్నాయి. జూలై 2011లో, అప్పటి కర్ణాటకలోని లోకాయుక్త, సంతోష్ హెగ్డే బళ్లారిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఒక నివేదికను ప్రచురించారు. అప్పటి నుంచి గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ సామ్రాజ్య పునాదులు కదలడం ప్రారంభమైంది.

ఓబుళాపురం గనుల్లో అక్రమాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లారు. దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష అనుభ‌వించి బెయిల్ పై విడుద‌య్యారు. అప్పటి నుంచి సీబీఐ నమోదు చేసిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి పర్యటనలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వస్ధలం బళ్లారికి అయితే అస్సలు వెళ్లొద్దని సుప్రీంకోర్టు గతంలో ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో బెయిల్ పై బయటికి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి స్వస్ధలం బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరారు. బళ్లారితో పాటు ఏపీలోని కడప, అనంతపురం జిల్లాల్లోనూ పర్యటించేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది.

గాలి జనార్ధన్ రెడ్డి పర్యటనలకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పడంతో ఆయన పర్యటనకు అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్ధానం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో గాలిపై నమోదైన మైనింగ్ కేసు విచారణ పెండింగ్ లో ఉండటంతో అప్పటి వరకూ ఆయన్ను స్వస్ధలానికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు గాలి జనార్ధన్ రెడ్డి టూర్ కు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో హైదరాబాద్ సీబీఐ కోర్టు గాలిపై నమోదైన ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించింది.

2015లో బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా విధించిన ఆంక్షలను సడలించాలని, బళ్లారి, కడప, అనంతపురంలో 8 వారాల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును గాలి జనార్దన్ రెడ్డి కోరారు. దీంతో విచారణ జరిపి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు… ఈ కేసుపై పూర్తిస్ధాయి విచారణ 3 నెలల తర్వాత చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు విచారణను నవంబర్ మూడో వారంలో లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రిజిస్ట్రీని కోరింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన టూర్ కి రెడీ అవుతున్నారు. సుదీర్ఘ కాలం అనంతరం ప్రస్తుత పరిస్థితులల్లో గాలి జనార్థన రెడ్డి పర్యటన ఆసక్తి దాయకంగా మారింది.

Show comments