చీరాల టీడీపీ ఇంఛార్జి యడం బాలాజీకి పొగపెడుతున్నదెవరు..?

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా యడం బాలాజీ కొనసాగుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరడాన్ని నిరసిస్తూ పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చీరాల టిక్కెట్‌ కరణం బలరాంకు దక్కగా.. ఆయన గెలిచారు. ఆ తర్వాత బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌లు టీడీపీని వీడి వైసీపీ పంచన చేరారు. చీరాల ఇంఛార్జి పదవికి ఖాళీ అవడంతో.. ఆ పోస్టులో యడం బాలాజీని నియమించారు. అయితే ఇప్పుడు చీరాల టీడీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యడం బాలాజీకి పొగపెడుతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

పొమ్మనలేక పొగపెడుతున్నారా..?

తాజాగా టీడీపీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వెలిగొండను అడ్డుకునే ప్రయత్నాలను ఎదుర్కొవాలని, గెజిట్‌లో చేర్చేందుకు చర్యలు చేపట్టాలనే అంశాలను ప్రస్తావిస్తూ ఓ లేఖ తయారు చేశారు.

అందులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు సంతకాలు చేశారు. వారి పేర్ల తర్వాత ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఒంగోలు ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, సంతనూతలపాడు ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్, కందుకూరు ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, కనిగిరి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి, మార్కాపురం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం ఇంఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, దర్శి ఇంఛార్జి పమిడి రమేష్‌బాబుల పేర్లు రాశారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల ఇంఛార్జిలు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు లేఖలో పొందుపరిచిన టీడీపీ నేతలు.. చీరాల ఇంఛార్జి అయిన యడం బాలాజీ పేరును మాత్రం పక్కనపెట్టడంతోనే ఆయనను పొమ్మనలేక పొగపెడుతున్నట్లు అర్థమవుతోంది.

Also Read : టీడీపీ జిల్లా సమావేశం.. నియోజకవర్గ ఇంఛార్జిలందరూ ఎందుకు డుమ్మా కొట్టారు..?

ఏలూరి అధ్యక్షుడైనప్పటి నుంచి..

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్ల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి యడం బాలాజీని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచిన ఏలూరి సాంబశివరావు.. గత ఏడాది పార్టీ మారతారనే ప్రచారం నడిచింది. అయితే చంద్రబాబు జోక్యంతో ఆయన నిర్ణయం మార్చుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో చీరాలలో తన వారిని ఇంఛార్జిగా నియమించాలనే ఆలోచనలు ఏలూరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే యడం బాలాజీని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

యడం బాలాజీ తీరు కూడా ఏలూరికి కలసివస్తోంది. ఎన్‌ఆర్‌ఐ అయిన యడం బాలాజీ ఇటీవల ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నారు. వ్యాపారాలు చూసుకుంటూ.. అప్పుడప్పుడు చీరాలకు వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానంగా చూపుతూ.. ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలని ఏలూరి సాంబశివరావు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే.. తాజాగా సీఎంకు రాసిన లేఖలో బాలాజీ పేరును మిస్‌ చేయడం. తమ చేతులకు మట్టి అంటకుండా.. తనకు తానే యడం బాలాజీ పార్టీని వీడేలా ఏలూరి వ్యూహాలు రచిస్తుండడం ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీలో చర్చనీయాంశమవుతోంది.

Also Read : ఈ రోజే డెడ్‌లైన్‌.. బుచ్చయ్య చౌదరి ఏం చేయబోతున్నారు..?

Show comments