గోరంట్ల రాజీనామాపై లోకేశ్ ప్ర‌భావం ఉందా?

తెలుగుదేశం పార్టీలో చంద్ర‌బాబునాయుడు త‌ర్వాత భావి నేత‌గా ఎదిగేందుకు ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ చేయ‌ని ప్ర‌య‌త్నాలు అంటూ ఉండ‌డం లేదు. అయితే, ఏదో ఎమ్మెల్సీ అయి బాబు హ‌యాంలో మంత్రి అయిన లోకేశ్ 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జా క్షేత్రంలో ఓట‌మిని చ‌విచూడ‌డంతో ఆయ‌న స‌త్తా ఏంటో అంద‌రికీ అర్థ‌మైపోయింది. ఆ ప్ర‌భావం పార్టీలో లోకేశ్ పాత్ర‌పైనా ప‌డింది. దీంతో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు త‌న చుట్టూ తానే పెద్ద స‌ర్కిల్ గీసుకుని, నేత‌లు ఎవ‌రైనా అది దాటి త‌న వ‌ద్ద‌కు రావాలంటే ష‌ర‌తులు విధించేవార‌న్న పేరు ఉంది. పార్టీలో సీనియ‌ర్లు కూడా త‌న మాట వినేలా చేసుకునేందుకు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌విని అడ్డుపెట్టుకుని ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌డం కొంద‌రికి న‌చ్చేదికాద‌ట‌. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు సీనియర్ ఎంఎల్ఏ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా అస్త్రం వెనుక ఈ త‌ర‌హా కార‌ణం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంంది.

బుచ్చయ్య నిర్ణ‌యాన్ని మార్చేందుకు చంద్రబాబునాయుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. అయిన‌ప్ప‌టికీ ఈ నెల 25న పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసేయాలని తాను డిసైడ్ అయినట్లు బుచ్చ‌య్య సన్నిహితులతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బుచ్చయ్య నిర్ణయానికి ఇత‌ర‌ కారణాలు ఎన్ని ఉన్నా తన సీనియారిటీకి లోకేశ్ ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఉంద‌ని తెలుస్తోంది. తాను ఫోన్ చేస్తే చంద్రబాబు లోకేష్ అసలు రెస్పాండ్ కావటం లేదన్నది ప్రధాన ఆరోపణ గా వినిపిస్తోంది. తనంతటి సీనియర్ ఫోన్ చేస్తే తండ్రి కొడుకులు ఫోన్ తీయకపోవటం ఏమిటనే బాధ గోరంట్లలో బాగా పెరిగిపోయిందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమను చంద్రబాబు నిర్లక్ష్యం చేసినా సీనియర్లు ఎలాగో సహించగలరు కానీ లోకేష్ నిర్లక్ష్యం చేస్తే మాత్రం తట్టుకోలేరు.

బుచ్చ‌య్య ఎపిసోడ్ తో లోకేష్ వ్యవహార శైలిపై ఇపుడు పార్టీలో చర్చ జరుగుతోంది కానీ గతంలో కూడా ఇదే విషయాన్ని చాలామంది ప్రస్తావించారు. మరో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పార్టీ ఆఫీసులో లోకేష్ ను కలుద్దామని అనుకుంటే అపాయింట్మెంట్ లేనిదే తాను ఎవరినీ కలవనని తన పీఏ ద్వారా చెప్పించారట. దాంతో ఒళ్ళుమండిపోయిన జేసీ ఆ తర్వా తెప్పుడూ లోకేష్ ను కలవడానికి ప్రయత్నం చేయలేదని సమాచారం. అలాగే స్పీకర్ గా పనిచేసిన మరో సీనియర్ నేత ప్రతిభా భారతి కూడా లోకేష్ కలుద్దామని ప్రయత్నిస్తే కుదరలేదట. పార్టీ ఆఫీసులో గంటలపాటు వెయిట్ చేసినా ప్రతిభకు నిరాశే ఎదురైందట. తనను కలవడానికి లోకేష్ ఇష్టపడకపోవటంతో ప్రతిభ కన్నీళ్లు పెట్టుకుని చివరకు పార్టీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయినట్లు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ ఘటనలు చంద్రబాబుకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదట.

తాను మంత్రిగా ఉన్న సమయంలో కలవడానికి తన చాంబర్ కు వచ్చిన కొందరు మంత్రులను కూడా లోకేష్ గంటల తరబడి వెయిట్ చేయించిన ఘటనలు చాలానే ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది సీనియర్లు చంద్రబాబు అధికారాన్ని ఆమోదించగలుగుతున్నారు కానీ లోకేష్ ను సహించలేకపోతున్నారు. తమ కళ్ళముందు పుట్టి పెరిగిన లోకేష్ తమను నిర్లక్ష్యం చేయటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇఫుడు బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ తో ఈ వ్య‌వ‌హారం మ‌రోమారు చ‌ర్చ‌గా మారింది. మరి దీనిపై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Show comments