టైం.. “బాబూ”.. టైం..!మరో వ్యూహకర్త వస్తున్నాడంట..

అసాధార‌ణ రాజ‌కీయ అనుభ‌వ‌శాలిగా నారా చంద్ర‌బాబు నాయుడికి పేరు. ఆయ‌న కూడా ఆ విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్పుకుంటారు కూడా. ఆ అనుభ‌వంతో ఆయ‌న చేసిన రాజ‌కీయాలు చాలా సార్లు ఫ‌లితాలు ఇచ్చాయి. ఇదంతా గ‌తంగా మారింది. కానీ… నిజం చెప్పాలంటే తెలుగు రాజకీయాల్లో ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా చంద్రబాబు ప్రస్థానం ప్ర‌త్యేక‌మైన‌దే. వ్యూహాలు పన్నటంలో దిట్టగా పేరున్న చంద్రబాబుకు.. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆయనకు దగ్గరకు వచ్చే వారెవరూ ఉండరని చెబుతారు. అలాంటి బాబుకు.. ఆయన పార్టీకి ఈ రోజున దిశానిర్దేశం చేసే వ్యూహకర్త కావాల‌ట‌. అంతేకాదు.. ఆయ‌న పార్టీ నేత‌లే వ్యూహ‌క‌ర్త ను నియ‌మించుకుంటే మంచిద‌ని బాబుపై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. మ‌రి బాబు స‌మ‌ర్ధ‌త‌పై ఆ పార్టీ నాయ‌కుల‌కే న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిందో ఏమో!

అయినా టైం బాగో లేక‌పోతే ఏం చేసినా క‌లిసి రాదు. మిగిలిన రంగాల కంటే.. రాజకీయ రంగంలో ఒక్కోసారి టైం కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అనుభ‌వాన్ని అంతా రంగ‌రించి ఎన్ని ఎత్తులు వేసినా పాచిక‌లు పార‌వు. దానికి తోడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. సంక్షేమ ర‌థాన్ని ఓవ‌ర్ స్పీడ్ లో తీసుకెళ్తున్నారు. ఇచ్చిన ప్ర‌తీ మాట నిల‌బెట్టుకునేందుకు ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. ఉద్దండులు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా.. రాజ‌కీయాలు చేస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌జాబ‌లం పెంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భ ఏపీలో పెద్ద‌గా వెలుగొంద‌డం లేదు. నాయ‌కుడితో పాటు మిగిలిన నేత‌ల ప‌రిస్థితి అలానే ఉంది. ప్ర‌భుత్వం నుంచి ల‌బ్దిపొందుతున్న వారు ప్ర‌తీ కుటుంబంలోనూ ఒక‌రిద్ద‌రు ఉంటున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచేందుకు వారికి అవ‌కాశం ఉండ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఎలా బ‌ల‌ప‌డాలో అంతుచిక్క‌డం లేదు.

మారిన కాలానికి తగ్గట్లుగా ఎన్నికల వ్యూహాల్ని సిద్ధం చేయటంలో బాబు అవుట్ డేటెడ్ అయ్యారన్న మాట పార్టీలో కూడా వినిపిస్తోంది. ఇందులో వాస్త‌వం కూడా లేక‌పోలేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో వ్యూహ‌క‌ర్త అవ‌స‌రం ఉంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఎప్పుడైనా సరే ఓటమి ఉన్న బలాన్ని సగం చేస్తే.. విజయం బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు బాబు పరిస్థితి ఇదే. అందుకే.. ఆయన తనకు..తన పార్టీకి అవసరమైన దన్ను కోసం తీవ్రంగా వెతుకుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు.. అధికారాన్నిహస్తగతం చేసుకోవటం కోసం సరైన వ్యూహకర్త కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

అమరావతి అంశాన్ని హైలెట్ చేయటంతోపాటు.. రాష్ట్ర రాజధానిగా అమరావతితోనే ఏపీ ముఖ చిత్రం మారుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయటంతో పాటు, అంత‌కంత‌కూ అంద‌నంత ఎత్తుకు ఎదుగుతున్న వైసీపీని ఎదుర్కోవటానికి అవసరమైన అస్త్రశస్త్రాల కోసం అవుట్ సోర్సింగ్ వ్యూహకర్త అవసరమని డిసైడ్ అయినట్లు చెబుతారు. మరి.. బాబు మైండ్ సెట్ తగ్గట్లు.. ఆయన్ను ఇంప్రెస్ చేసే వ్యూహకర్తలో సమకాలీన రాజకీయాల్ని అర్థం చేసుకోవటం.. చిన్నబాబును సైతం కంట్రోల్ చేయటం చాలా అవసరం. ఇన్ని టాస్కుల్ని డీల్ చేసే వ్యూహకర్త బాబుకు దొరుకుతారా అనేది ఇప్పుడు మ‌రో ప్ర‌శ్న. అయితే వ్యూహ‌క‌ర్త‌ను పెట్టుకున్నా బాబుకు క‌ష్ట‌మే. అంత‌న్నారు.. ఇంత‌న్నారు.. ఆయ‌నే మ‌రొక‌రి దిక్కు చూస్తున్నారు.. అన్న ప్ర‌చార‌మూ తెర‌పైకి వ‌స్తుంది.

Show comments