Amit Sha,Sujana,CM Ramesh – సుజనా, సీఎంలకు అమిత్ షా టార్గెట్…? గురువుగారి గుండెల్లో గునపం…!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రయాణం ఏంటి అనే దానిపై ఆ పార్టీ నాయకులకు కూడా స్పష్టత లేదు. ఎక్కడో ఒకరిద్దరు నాయకులు మినహాయించి పెద్దగా ప్రజల్లో ఉన్న నాయకులు కూడా ఎవరూ ఉండరు. రాజ్యసభ ఎంపీలు ఉన్నా సరే వాళ్ళు వ్యాపారవేత్తలు కావడంతో పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం రాష్ట్రంలో సమర్థవంతంగా లేదనే చెప్పాలి. సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతోంది అనే భావన కూడా చాలామందిలో ఉంది.

ప్రస్తుతం సోము వీర్రాజు కొన్ని కొన్ని విషయాల మీద ఎక్కువగా దృష్టి సారించి, కొంతమంది మీద ఫిర్యాదులు చేయడంతో, చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పార్టీలో నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. అయితే తాజాగా బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజెపి రాష్ట్ర నాయకులతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది నాయకులకు క్లాస్ తీసుకున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించేవారి మీద ఎక్కువగా ఫోకస్ చేసి… ఆయన కామెంట్స్ చేశారు అని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సందర్భంగా సుజనాచౌదరి అలాగే సీఎం రమేష్ ఇద్దరితో ఆయన సుదీర్ఘంగా దాదాపు గంట సేపు మాట్లాడారు అని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అలాగే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం పై పత్రికల్లో వస్తున్న కథనాలు, అలాగే కొన్ని కొన్ని అంశాల గురించి ఆయన వీళ్ళిద్దరితో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నాయకులకు హోంమంత్రి కొన్ని టార్గెట్లు పెట్టినట్టుగా కూడా ప్రచారం మొదలైంది.

Also Read : Ravela – ఆ మాజీ మంత్రి బీజేపీ నా? టీడీపీ నా ?

కడప జిల్లా తో పాటుగా చిత్తూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులను బీజేపీ లోకి తీసుకు వచ్చే విధంగా కష్టపడాలని, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ని కడప జిల్లా మీద పెట్టి, తెలుగుదేశం పార్టీ వైపు చూసే కాంగ్రెస్ పార్టీ నాయకులను బిజెపిలోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయాలని సూచించినట్లు సమాచారం. అదేవిధంగా సుజనాచౌదరి కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులను బీజేపీ లోకి వచ్చే విధంగా మాట్లాడాలని కూడా అమిత్ షా చెప్పారని మీడియా వర్గాలు అంటున్నాయి.

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న వాళ్లను టార్గెట్ చేసి, పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే, వచ్చే రెండేళ్లలో పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని, క్షేత్రస్థాయిలో కాస్త ప్రజల్లోకి తిరిగే నాయకుల మీద ఫోకస్ చేసి ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పినట్లుగా సమాచారం. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరు మీద ఫోకస్ పెట్టి ప్రజలు కోరుకునే అంశాలమీద ముందుకు వెళ్లవలసిందిగా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. అలాగే వైసిపి వైపు చూసే తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పార్టీలోకి తీసుకు రావాల్సిందిగా అమిత్ షా వీళ్ళిద్దరికి సూచించారని తెలుస్తోంది. కడప జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని సమాచారం తన వద్ద ఉందని కాబట్టి వాళ్ల మీద దృష్టి పెట్టి పార్టీలోకి తీసుకోవాల్సిందిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా చెప్పినట్టుగా వీళ్లిద్దరు వ్యవహరిస్తే మాత్రం వీరిద్దరి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

Also Read : Amit Shah, AP BJP -అమిత్ షా సూచనలు.. ఏపీలో బీజేపీ పుంజుకునేనా?

Show comments