Idream media
Idream media
అనుకున్నదే జరిగింది… ఉదయం రాసినట్లే ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని మిడిల్ ఆర్డర్ యువ ఆటగాడు ఓలి పోప్ ఇంగ్లాండ్ జట్టుని ఆదుకున్నాడు. సహచరుల వికెట్ లు పడుతున్నా సరే ఈ ఇంగ్లాండ్ యువ ఆటగాడు నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టుని ముప్ప తిప్పలు పెట్టి… చెయ్యాల్సిన నష్టం చేసేసాడు. ఓవర్ నైట్ స్కోర్ మూడు వికెట్ ల నష్టానికి 53 పరుగులతో రెండో రోజు మొదలు పెట్టిన ఇంగ్లాండ్ కు భారత బౌలర్లు ఆట మొదలైన కాసేపటికే షాక్ ఇచ్చారు.
మలన్ అలాగే ఓవర్టన్ ను క్రీజ్ లో నిలబడకుండానే వెనక్కు పంపేసారు. అక్కడ మ్యాచ్ లో పట్టు చిక్కిందని భావించినా సరే ఆ తర్వాత మాత్రం బెయిర్ స్టో తో కలిసి పోప్ మైమరిపించే షాట్ లు ఆడాడు. తమకు మొదటి ఇన్నింగ్స్ లో కొరకరాని కొయ్యగా మారిన శార్డుల్ ఠాకూర్ బౌలింగ్ లో స్వేచ్చగా షాట్ లు ఆడేసాడు. ఫోర్ల మీద ఫోర్లు కొట్టి వన్డే మ్యాచ్ ని గుర్తు చేసాడు. బెయిర్ స్తో కూడా పోప్ బ్యాటింగ్ చూసి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసాడు. ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ ను నిలబెట్టారు. అయితే అర్ధ సెంచరీ చేస్తాడు అని భావించిన బెయిర్ స్తో 37 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
Also Read:నాలుగో టెస్ట్: భారత్ గెలవాలంటే ఏం జరగాలి…? టీం ఇండియాకు ఉన్న అద్భుత అవకాశాలు ఏంటీ…?
ఇక అక్కడి నుంచి మోయీన్ అలీ తో కలిసి మరోసారి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసాడు పోప్. వికెట్ లు పడటంతో దూకుడు తగ్గించి వికెట్ కాపాడుకోవడం మీద దృష్టి పెట్టాడు. అటు మోయీన్ అలీ కూడా డిఫెన్స్ ఆడుతూనే అప్పుడప్పుడు ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించాడు. అయితే జడేజా వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన అలీ… రోహిత్ కు క్యాచ్ ఇచ్చి 35 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సీనియర్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ తో కలిసి తన వంతు ప్రయత్నం మొదలుపెట్టాడు పోప్.
సెంచరీ చేస్తాడని భావించినా సరే అనూహ్యంగా ఠాకూర్ బౌలింగ్ లో పోప్ 81 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రిస్ వోక్స్ (50 ) చివర్లో దూకుడుగా ఆడే క్రమంలో భారత్ ను కాస్త ఇబ్బంది పెట్టాడు. చివర్లో అనవసర పరుగు కోసం ప్రయత్నం చేసి రనౌట్ అయ్యాడు. అండర్సన్ (1) నుంచి వోక్స్ కి సహకారం అందకపోయినా దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేసాడు. ఇంగ్లాండ్ 290 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 99 పరుగుల లీడ్ లో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా ఓపెనర్లు, టాప్ ఆర్డర్ చేసే స్కోర్ మీదనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
పిచ్ క్రమంగా బ్యాటింగ్ కి అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించాలి. రోహిత్, కెఎల్ రాహుల్ ఎంత వరకు నిలబడతారో చూడాలి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం కంటే… మ్యాచ్ లో సమయాన్ని కరిగించడం పై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది కాబట్టి… పిచ్ క్రమంగా బ్యాటింగ్ కి అనుకూలంగా మారే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి స్ట్రైక్ రేట్ మీద దృష్టి పెట్టకుండా… నిలబడితే… స్వింగ్ ని ఆపగలిగితే విజయావకాశాలు ఉండొచ్చు… రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Written By
Venkat G