Rayalaseema – రాయలసీమ ప్రజల అస్తిత్వం – రాయలసీమగా నామకరణం

భౌగోళికంగా ఈదేశమంతా ఒకే భూభాగంగా ఉంది . కానీ మనిషి జీవించే స్థితిగతులే ఒక్కోచోట ఒక రకంగా ఉన్నాయి . జీవన పరిస్థితులే కాకుండా మాట్లాడే భాష కూడా ప్రాంతీయ అనే భావన ఏర్పాటుకు కారణమవుతున్నది.

ప్రాంతీయత అనేది తమపై జరిగే వివక్షను గుర్తించి దాన్ని కొనసాగించడం సరైనది కాదని ప్రశ్నించడం. అలా ప్రశ్నిస్తూ తమ స్వీయ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించడంలో భాగంగా ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టుకోవడం చాలా అవసరం . అది కూడా వెలివేయబడ్డ , విడిచిపెట్టబడిన అని పేరు పడిన ప్రాంతానికి పేరు పెట్టడం అంటే ఆ ప్రాంత ప్రజలందరి ఉనికి చాటే విధంగా ఉండడం చాలా అవసరం . ఆ ఉనికి చాటుకొనే నేపథ్యంలోనే దత్తమండలం , సిడెడ్ జిల్లాలు అని పిలవబడే జిల్లాలకు రాయలసీమ అని నామకరణం చేయడం ఆహ్వానించదగినది. ఆ నామకరణం జరిగి నేటికి 93 మూడు సంవత్సరాలు అయిన నేపధ్యంలో ఆ చరిత్రను కూడా గుర్తుచేసుకుంటుంది నేడు రాయలసీమ. 

ఇప్పుడు రాయలసీమగా పిలవబడుతున్న ప్రాంతాన్ని అనేకమంది రాజులు , రాజ్యాలు పరిపాలించాయి. 16, 17 వ శతాబ్దాలలో ఈ ప్రాంతం మట్ల సంస్థానాదీశుల చేతిలో ఉండేది . ఈ కాలంలోనే నడిమింటి వెంకటపతి అనే కవి తన ‘ అభిషిక్తరాఘవం ‘ అనే ప్రబందంలో మట్ల ఆనంతరాజును వర్ణించే సందర్భంలో ‘రాయలసీమ ‘అనే పేరును పద్యంలో వాడాడు. అక్కడ మనకు మొదటగా రాయలసీమ అనే పదం కనపడుతుంది .

అంతే కాదు రాయలసీమకు ఒకప్పుడు హిరణ్యకరాష్ట్రమని , ములికినాడు , రేనాడు అనే పేర్లు కూడా ఉండేవి . ఆతరువాత బ్రిటిషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చింది. ఐతే నిజాం ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలివేయడంతో వాళ్ళు ఈ ప్రాంతాన్నీ సిడెడ్ అని పిలిచేవారు. సీడెడ్ అంటే వదిలివేయబడిన , విడిచిపెట్టబడిన అని అర్థం . ఐతే 1928లో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభల్లో చిలుకూరి నారాయణరావు గారు దత్త అనే మాటను బానిసత్వానికి చిహ్నంగా పేర్కొని ఈ ప్రాంతానికి “రాయలసీమ” అని నామకరణం చేస్తే అందరూ ఆమోదిస్తారు. ఆ సందర్భంలొనే 128 పంక్తుల్లో మంజరీ ద్విపదలో ‘ దత్త’ పేరుతో ఒక పద్యంలో రాయలసీమ ఘనతను తెలియజేశారు. రాయలసీమ అస్తిత్వాన్ని చెప్పుకోవాలంటే మొదటగా ఈ పద్యాన్ని చెప్పుకోవాలి .

అందులో ఒక నాలుగు పంక్తులను చూస్తే మనకు రాయలసీమగా నామకరణం చేయడానికి గల కారణాలు తెలుస్తాయి..

దత్తనందురు నన్ను దత్తనెట్లగుదు

రిత్తస మాటల చేత చిత్తము కలిగే

ఇచ్చినదెవ్వరో పుచ్చినదెవరో
పుచ్చుకొన్నట్టి యా పురుషులు నెవరో

తురక బిడ్డండిచ్చె దొరబిడ్డ పట్టె

అత్తసొమ్మునుగొని యల్లుండు
దాన మమర జేసెనటన్న యట్లున్నదిది.

అని చారిత్రక సత్యాలను ఒకసారి గుర్తుచేస్తూ ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు సముచితమని పేర్కొన్నాడు .

ఇప్పటికి తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రతినిత్యం పోరాడుతున్న ఈ ప్రాంతానికి ఈప్రాంతం వాడు కాకపోయినా రాయలసీమ అని నామకరణం చేసిన చిలుకూరి నారాయణరావును ఒకసారి స్మరించుకుంటూ … జై రాయలసీమ.

– నిప్పులవాగు నరేన్

Also Read : Rayalaseema – రాయలసీమకు 93 వసంతాలు

Show comments