Idream media
Idream media
అనంతపురం జిల్లా గంపమల్లయ్య కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య స్వామికి పూజలు చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ జారీ పడి పూజారి పాపయ్య మృతి చెందడం భక్తుల్లో విషాదాన్ని నింపింది. శింగనమలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండల మధ్య గంపమల్లయ్య స్వామి కోలువై ఉన్నారు. ఏడు కొండలు దాటి గంపమల్లయ్య స్వామి వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. చుట్టూ ఎటు నుంచి వచ్చినా.. ఏడు కొండలు దాటితేనే స్వామి వద్దకు చేరుకోగలగడం ఇక్కడ ప్రత్యేకత. శింగనమల నుంచి నాలుగు కిలోమీటర్లు వాహనాలపై వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపు 11 కిలోమీటర్ల మేర అడవిలో నడక ద్వారా ప్రయాణిస్తూ, కొండలు ఎక్కి దిగుతూ మధ్యలో ఎత్తయిన కొండపై ఉన్న గంపమల్లయ్య స్వామి సన్నిధికి భక్తులు చేరుకుంటారు.
ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని నాలుగు శనివారాలు గంపమల్లయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. పూజలు చేసే సమయంలో భక్తులు గోవింద నామస్మరణ చేస్తారు. గంపమల్లయ్య స్వామిని ఇక్కడ ప్రజలు వెంకటేశ్వర స్వామిలా భావించి కొలుస్తారు.
శ్రావణ మాసం తొలి శనివారం నాడు గంపమల్లయ్యను కొలిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొండపై ఉన్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పూజారి పాపయ్య.. ఓ కండువలో ఒక వైపు భక్తులు సమర్పించిన ప్రసాదాలు, మరో వైపు పూజా సామాగ్రి కట్టుకుని, ఆ కండువను మెడలో వేసుకుంటారు. జేగంట వాయిస్తూ.. ఎలాంటి ఆధారం లేకుండా కొండకు 20 అడుగుల దిగువన ఉన్న గుహాలోకి వెళ్లి కండువలో తీసుకెళ్లిన నైవేథ్యం, పూజా సామాగ్రిని అక్కడ ఉంచి, తిరిగి ఎలాంటి ఆధారం లేకుండా కొండపైకి చేరుకోవడం ఆచారం.
గుహలో గంపమల్లయ్య స్వామి ఉంటారనేది భక్తుల నమ్మకం. తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా పూజారి పాపయ్య కొండపై ఉన్న ఉత్సవ మూర్తులకు పూజలు చేసి, కొండ మధ్యలోని గుహలోకి వెళ్లేందుకు పయనమవగా.. రెండు అడుగులు వేయగానే కాలు జారి ఎత్తయిన కొండపై నుంచి కిందపడ్డారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో భక్తుల్లో విచారం నెలకొంది.
Also Read : పరిటాల ‘బుల్లెట్’ కథేంది..? సునీత ఎందుకు కలవరపడుతున్నారు..?