కేంద్రంలో ఈ సారి బీజేపీ రాదట.. ఆ పార్టీలదే పెత్తనమట.. మాజీ ప్రధాని అంచనా నిజమవుతుందా..?

ఐదేళ్లకోసారి ఏర్పడే ప్రభుత్వాలపై రాజకీయాల్లో సీనియర్‌ నేతలు అంచనాలు వేయడం సాధారణంగా జరిగేదే. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఓడిపోతుంది..? అనే అంశాలపై తాజా పరిస్థితులను ఆధారంగా చేసుకుని వారి అనుభవాలతో విశ్లేషించి చెబుతుంటారు. ఈ తరహాలోనే మాజీ ప్రధాని దేవెగౌడ్‌ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని చెప్పారు. శనివారం తిరుపతికి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి కేంద్రంలో జాతీయ పార్టీలు ఏవీ సొంతంగా అధికారంలోకి రాలేవని చెప్పారు. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, అవన్నీ కలిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జోస్యం చెప్పారు. అయితే ఆయా ప్రాంతీయ పార్టీలు కలిసి పని చేయాలంటే కామన్‌ ఎజెండా కావాలన్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతి ఆస్తులను అమ్మేస్తుండడంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ ధరలు రికార్టులు సృష్టిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కోవిడ్‌ కష్టాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలను బీజేపీ ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు. లాక్‌ డౌన్‌లో కనీసం వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేసే ప్రయత్నం కూడా చేయలేదు. వ్యాపారాలను ప్రైవేటు పరం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం… వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్‌ పరం చేసేందుకు నూతనంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ఆందోళనలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితులను, నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనను ఆధారంగా చేసుకుని దేవెగౌడ్‌ ఈ అంచనాలు వేశారని అర్థమవుతోంది.

Also Read : ‘దేశం’ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంట

అయితే, 2019లో కూడా బీజేపీ ప్రభుత్వం రాదని రాజకీయ ప్రముఖులు అంచనాలు వేశారు. విదేశాల్లో ఉన్న నల్లధన తీసుకువచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న హామీని నరేంద్రమోదీ అమలు చేయకపోవడం, బడాబాబులు వందల, వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినా వారిపై చర్యలు తీసుకోకపోవడం, 2016 నవంబర్‌లో చేసిన పెద్దనోట్ల రద్దు వల్ల జరిగిన నష్టం, 2017లో జూలై నుంచి అమలు చేసిన జీఎస్టీని వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకించడం వంటి పరిణామాలతో బీజేపీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుందని అంచనాలు కట్టారు. కానీ అంచనాలు తల్లకిందులయ్యాయి. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. పైగా 2014లో సొంతంగా 282 సీట్లు గెలిచిన బీజేపీ.. 2019లో 303 సీట్లు గెలిచింది. మునుపటి కన్నా అదనంగా 21 సీట్లు సాధించింది.

ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి..? ప్రజల నాడి ఎలా ఉంటుంది..? అనే దానిపై పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని 2019 ఫలితాల ద్వారా అర్థమవుతోంది. అయితే ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు అవుతుండడంతో వ్యతిరేకత సాధారణంగా నెలకొంటుంది. పైగా నరేంద్ర మోదీకి జనాకర్షణ కూడా ఆయన సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనతో తగ్గిపోయిందని పలు సర్వేలు చెబుతున్నాయి. దేశం వెలిగిపోతోంది నుంచి దేశం నలిగిపోతోంది వరకూ పరిస్థితులు ఏర్పడ్డాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవెగౌడ అంచనాలు నిజం కావచ్చు, కాకపోనూవచ్చు.

Also Read : ఒక్క మాట.. ఎంత పని చేసింది చింతమనేని..!?

Show comments