Idream media
Idream media
ఆశ మనిషిని బతికిస్తుందంటారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ నేతలను చూస్తే ఆ మాట నిజమేననిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని, తెస్తామని కాంగ్రెస్‌నేతలు ప్రకటిస్తున్నారు. ఏపీలో పార్టీ సంస్థాగత మార్పులు, బలోపేతంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, హర్షకుమార్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు. భేటీ అనంతరం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌పార్టీకి పూర్వవైభవం తెస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక ఎమ్మెల్యే స్థానం కూడా గెలుచుకోలేదు. పోటీ చేసిన స్థానాల్లో ఒక్క చోట కూడా కనీసం డిపాజిట్ దక్కించుకోలేదు. రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ కాబట్టి.. ప్రజలు ఆ పార్టీని ఓడించారని అనుకున్నా.. ఐదేళ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాత మారలేదు. 2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీ బోణికొట్టలేదు. ఐదో స్థానంలోకి ఆ పార్టీ పడిపోయింది. ఒక్క శాతం కన్నా తక్కువ ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న నేతలను వేళ్లమీద లెక్కించవచ్చు. నేతలే కాదు క్యాడర్ కరువు ఆ పార్టీకి ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేవీపీ ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది.
కిరణ్‌కుమార్ రెడ్డి యాక్టివ్ అవుతారా..?
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో పాల్గొనడం నూతన పరిణామం. రాష్ట్ర విభజన జరగదు, చివరి బాల్ ఉంది అంటూ విభజన సమయంలో మాట్లాడిన కిరణ్‌కుమార్ రెడ్డి.. విభజన తర్వాత ఏపీలో జై సమైక్యాంధ్రపార్టీని ఏర్పాటు చేసి చెప్పులగుర్తుతో పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన కిరణ్‌కుమార్ రెడ్డి.. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారో కూడా ఎవరీ తెలియదు. 2019 ఎన్నికల్లోనూ ఆయన జాడ కనిపించలేదు. ఏడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్లీ యాక్టివ్ అవుతారా..? కేవీపీ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కోసం పని చేస్తారా..? వేచి చూడాలి.
Also Read : నేతల కోసం ఏపీ బీజేపీ ప్రత్యేక వేట