గుండెపోటుకు గురైన టీడీపీ సీనియర్‌ నేత పరిస్థితి ఎలా ఉంది..?

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు స్వల్ప హార్ట్‌ఎటాక్‌ వచ్చినట్లు గుర్తించారు. ఆస్పత్రిలోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇతర నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చి జోత్యుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరికొద్ది రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ ఆరంగేట్రం చేసిన జ్యోతుల వెంకట అప్పారావు అలియాస్‌ నెహ్రూ.. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. 2004లో ఓటమి చవిచూశారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి అభిమాని అయిన ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ ప్రొద్బలంతో ప్రజా రాజ్యం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. జగ్గంపేట నుంచే మళ్లీ పోటీ చేసినా ఓటమి తప్పలేదు. పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీ నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. ఈ క్రమంలో నెహ్రూ వైసీపీలో చేరారు. పార్టీ ప్రకటన కూడా జగ్గంపేటలోనే వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాపు సామాజికవర్గం నేత కావడంతో సీఎం జగన్‌ జ్యోతుల నెహ్రూకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు. వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పదవిని కట్టబెట్టారు.

2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నెహ్రూ దశాబ్ధం తర్వాత గెలుపు రుచి చూశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ నెహ్రూకు జగన్‌ పెద్దపీట వేశారు. శాసన సభలో ఉప నేతగా నియమించారు. పార్టీలో జగన్‌ తర్వాత నెంబర్‌ 2 ఎవరంటే.. జ్యోతుల నెహ్రూ పేరు అప్పట్లో వినిపించేది. పార్టీలోనూ ఉన్నత స్థాయి పదవులు కల్పించారు. అయితే 2016లో  టీడీపీ పన్నిన ఉచ్చులో నెహ్రూ పడిపోయాడు. నెహ్రూ టీడీపీలో ఉండి ఉంటే.. నా పదవి ఆయనదేనంటూ అప్పటి డిప్యూటీ సీఎం హోదాలో హోం మంత్రిగా ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. ఆ ట్రాప్‌లో పడిన నెహ్రూ పార్టీ ఫిరాయించారు. తమ నేతకు మంత్రి పదవి వస్తుందని, విద్యుత్‌ శాఖను కేటాయించబోతున్నారంటూ ఆయన అనుచరులు అప్పట్లో చర్చించుకున్నారు.

Also Read : సంచలనానికి ప్రయత్నించి అరెస్ట్‌ అయిన లోకేష్‌

అయితే ఏడాదికే నెహ్రూకు సీన్‌ అర్థం అయింది. బాబు వాడకం ఎలా ఉంటుందో తెలిసింది. మంత్రి పదవి కాదు కదా కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. మంత్రి పదవి ఆశలు వదిలేసుకున్న నెహ్రూ.. కనీసం తమ కుమారుడికైనా ఏదో ఒక పదవి ఇవ్వాలనే స్థితికి వచ్చారు. దీంతో జెడ్పీ చైర్మన్‌ స్థానంలో ఉన్న నామన రాంబాబు స్థానంలో నెహ్రూ కుమారుడు నవీన్‌ కుమార్‌ను చైర్మన్‌గా చేశారు. రెండున్నరేళ్ల కాలం నవీన్‌ ఆ పదవిలో కొనసాగారు. జడ్పీ చైర్మన్‌ అనే పేరు తప్పా.. నవీన్‌ అధికారం చెలాయించింది శూన్యమే.

తనతోపాటు తన తోడళ్లుడు అయిన పక్క నియోజకవర్గం ప్రత్తిపాడు ఎమ్మెల్యే తోట సుబ్బారావును కూడా టీడీపీలోకి తీసుకువెళ్లిన నెహ్రూకు 2019 ఎన్నికల్లో తాను చేసిన తప్పు ఏమిటి..? ఏం నష్టపోయానో అర్థం అయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన నెహ్రూ, సుబ్బారావులు ఓటమి చవిచూశారు. వరుసగా రెండోసారి జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. 2014లో తొలిసారి పోటీ చేసిన వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 స్థానాలకు గాను 5 నియోజకవర్గాల్లో గెలవగా.. 2019 మాత్రం 15 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. నెహ్రూ కానీ పార్టీలోనే ఉంటే.. ఈ సారి గెలిచేవారు. మంత్రి పదవి దక్కించుకునేవారని జిల్లా వాసులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.

గత ఏడాది జరిగిన టీడీపీ మహానాడులో. పార్టీని బతికించేందుకు మోదీతో మాట్లాడాలంటూ చంద్రబాబుకు సూచించి సంచలనం సృష్టించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో జ్యోతుల నెహ్రూ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు.

Also Read : బాబు రాజకీయాలు.. పెదవి విరుస్తున్న తమ్ముళ్లు..

Show comments