Idream media
Idream media
దేశ వ్యాప్తంగా వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కరోనా కారణంగా ఉప ఎన్నికల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మే నెల మొదటి వారంలో ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వైరస్ వ్యాప్తి తగ్గడంతో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు ఉప ఎన్నికలకు జరిగే రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. స్వల్ప సంఖ్యలో కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహించాలా..? వద్దా..? అనే అంశంపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ నెల 30వ తేదీ లోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని తెలిపింది. మెజారిటీ పార్టీలు ఎన్నికలకు సిద్ధమనే అభిప్రాయాలను వ్యక్తం చేసిన తరుణంలో వచ్చే నెలలోనే ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలలోనూ ఉప పోరు..
తెలుగు రాష్ట్రాలలోనూ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 27వ తేదీన మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మార్చిలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యునిగా పేరొందిన డాక్టర్ వెంకట సుబ్బయ్య 2016లో వైసీపీ ద్వారా రాజకీయ ఆరంగ్రేట్రం చేశారు. ఆ పార్టీ బద్వేల్ కో ఆర్డినేటర్‌గా పని చేసి 2019లో తొలిసారి పోటీ చే సి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరణించి ఇప్పటికే దాదాపు నాలుగు నెలలు కావడంతో ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ప్రజా ప్రతినిధి ఏదైనా కారణంతో మరణిస్తే.. అక్కడ పోటీ చేయకూడదనే సంప్రదాయాన్ని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ పాటించింది. అయితే ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆ సాంప్రదాయాన్ని పాటించడంలేదని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికతో స్పష్టమైంది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లిదుర్గా ప్రసాద్ కరోనాతో మృతి చెందగా.. టీడీపీ ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. అదే తీరును బద్వేల్ ఉప ఎన్నికలోనూ టీడీపీ కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలింగ్ అనివార్యం కానుంది.
హుజురాబాద్‌లో ఆసక్తికరం..
బద్వేల్‌లో పోటీ ఉన్నా వార్‌వన్‌సైడ్‌గా ఎన్నిక జరుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే అక్కడ ఉప ఎన్నికపై అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ పార్టీలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆలోచించనున్నాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాలలోనే ఆసక్తికరంగా సాగబోతోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నికలో.. టీఆర్‌ఎస్, ఈటల రాజేందర్ నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. నోటిఫికేషన్ రాక ముందే.. హుజురాబాద్‌లో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు, ఈటల రాజేందర్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈటలను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈటల రాజేందర్ చావో రేవో మాదిరిగా ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఉత్కంఠ భరితంగా సాగే ఈ ఉప ఎన్నికకు వచ్చే నెలలో నగరా మోగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని అన్ని పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపే అవకాశాలు ఉన్నాయి.
Also Read : మోత్కుపల్లికి ఎట్టకేలకు దక్కిన ఒక పదవి బాధ్యత