చేసిన పని మరిచిపోయారా బాబూ..?

తాను చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అనేలా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తుంటారని ఓ విమర్శ. అది నిజమేనని ఆయన నిత్యం నిరూపించుకుంటూనే ఉంటారు. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన రెండు నాల్కల ధోరణికి అద్దంపడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం సరికాదంటున్నారు చంద్రబాబు. దీని వల్ల సేవలు పొందుతున్న వారు ప్రాథమిక పాఠశాలలకు వచ్చే అవకాశం ఉండదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం లక్ష్యం ఏమిటి..? విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి..? అనే అంశాలను తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు అంగన్‌వాడీకేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలో విద్యా విధానంలో జగన్‌సర్కార్‌ పలు మార్పులు చేసింది. ప్రాథమిక దశలోనే విద్యార్థుల చదువులకు గట్టిపునాది వేసేలా ఆరంచెల విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం.. శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2) , ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2), ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ-1 నుంచి 5వ తరగతి వరకు), ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు), హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు), హైస్కూల్ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) గా విభజించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల మధ్య ఉన్న దూరాలు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీలును బట్టీ ఆయా పాఠశాలల ఏర్పాటు ఉంటుంది.

Also Read : పాపాగ్ని- చూసొద్దాం రండి

ఈ విధానంతో పీపీ–1 నుంచే పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు చెబుతారు. ఒకటో తరగతి నుంచి సీబీఎస్‌సీ సిలబస్‌లో విద్యా బోధన చేస్తారు. అందుకు అనుగుణంగా విద్యార్థులను అంగన్‌వాడీ కేంద్రాల నుంచే తీర్చిదిద్దుతారు. పైగా ఈ విధానంలో ప్రతి క్లాస్‌కు ఒక టీచర్‌ ఉంటారు. ఫలితంగా విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రెండు మూడు తరగతులకు ఒక టీచర్‌ ఉన్న పరిస్థితి నూతన విధానంలో పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధానం వల్ల అంగన్‌వాడీలకు, ఆయాలకు ఎలాంటి నష్టం ఉండదు. ఎప్పటిలాగే వారు తమ సేవలను అందించాల్సి ఉంటుంది.

అసలు విషయాన్ని తెలుసుకోకుండా.. చంద్రబాబు విలీనం అంటూ తన పరిపాలనలో చేసినట్లు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలోని అంగన్‌వాడీలను విలీనం చేశారు. సమీపంలోని రెండు లేదా మూడు అంగన్‌వాడీ కేంద్రాలను కలిపి ఒకే కేంద్రంగా ఏర్పాటు చేయాలని తలపెట్టారు. కొన్ని మున్సిపాలిటీలలో ఆ పనిని కూడా పూర్తి చేశారు. విలీనం వల్ల ప్రభుత్వం తమను తొలగించే ప్లాన్‌ చేస్తుందనే అనుమానాలతో అప్పుడు అంగన్‌వాడీలు, ఆయాలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా విలీనం ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. ఆ తర్వాత బాబు ప్రభుత్వం ఓడిపోవడంతో పట్టణ, నగరాల్లోని అంగన్‌వాడీలు ఊపిరిపీల్చుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను కుదించే ప్రయత్నాలను తన ప్రభుత్వ హాయంలో చేసిన చంద్రబాబు.. తన పాలనను మరిచి ఇప్పుడు పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : విశాఖకు వచ్చే ముప్పేమీ లేదు

Show comments