Idream media
Idream media
అలా రాజీనామా లీకులు ఇచ్చారో లేదో ఇలా టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి ఇంటి వద్ద వాలిపోయారు. వారి వద్ద బుచ్చయ్య చౌదరి తాను ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లను పెట్టారు. చంద్రబాబు కూడా ఫోన్‌లో మాట్లాడారంటున్నారు. వచ్చే వారంలో అమరావతిలో ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడుకుందాం.. అని బాబు చెప్పారంటున్నారు. రాయబారం వచ్చిన టీడీపీ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పు. కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు.. బుచ్చయ్య చౌదరి సమస్యలు, డిమాండ్లను తమ అధినేత చంద్రబాబు తీరుస్తారని చెప్పారు. ఈ డిమాండ్లు తీరే వరకూ బుచ్చయ్య చౌదరిలో అసంతృప్తి అలానే ఉంటుందనడంలో సందేహం లేదు.
అయితే స్థానికంగా పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు తీర్చగలరా..? డిమాండ్లను నెరవేర్చగలరా..? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బుచ్చయ్య చౌదరి వ్యాపార రీత్యా రాజమహేంద్రవరం వలస వెళ్లారు. వ్యాపారం చేస్తూనే.. టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజమహేంద్రవరంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి నాలుగు సార్లు, రూరల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచారు. ఒకప్పుడు టీడీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులను సిఫార్సు చేసే స్థాయి ఉన్న నేత గోరంట్ల. రాజమహేంద్రవరం టీడీపీ రాజకీయాలను తన కనుసైగలతో శాసించారు. ఆయనకు తెలియకుండా రెండు నియోజకవర్గాల్లో ఏమీ జరగదంటే అతిశయోక్తికాదు.
అయితే ఆదిరెడ్డి అప్పారావు తిరిగి పార్టీలోకి రావడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆదిరెడ్డి అప్పారావు రూపంలో గోరంట్ల ఆధిపత్యాన్ని సవాల్ చేసే మరో వర్గం తయారైంది. టీడీపీ తరఫున రాజమహేంద్రవరం మేయర్‌గా ఆదిరెడ్డి అప్పారావు సతీమణి వీర రాఘవమ్మ పని చేశారు. వర్గపోరు కారణంతోనే ఆదిరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ తరఫున తొలి ఎమ్మెల్సీ పదవి దక్కిన నేత ఆదిరెడ్డే కావడం విశేషం. 2017లో ఆదిరెడ్డి మళ్లీ టీడీపీలోకి ఫిరాయించారు.
Also Read : బాబుని బజారున పడేసిన బుచ్చయ్య
సిటీ నియోజకవర్గంలో పట్టుసాధించే ప్రయత్నాలను ఆదిరెడ్డి బలంగా చేశారు. గోరంట్లను రూరల్ నియోజకవర్గానికే పరిమితం చేయాలని ప్రయత్నించారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గోరంట్లను సిటీలో పాల్గొనకుండా చేయగలిగారు. 2018 ఉగాది రోజున పార్టీ సిటీ కార్యాలయం వద్ద గోరంట్ల రాక ముందే ఆదిరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇది ఇద్దరి మధ్య బాహాబాహీకి దిగే పరిస్థితికి దారి తీసింది. శ్రేణుల సమక్షంలోనే ఆదిరెడ్డి అప్పారావు, గోరంట్ల.. నువ్వేంత అంటే నువ్వేంత అనుకున్నారు. గోరంట్లను రూరల్ నియోజకవర్గానికే పరిమితం చేసేందుకు ఆదిరెడ్డి చేసిన ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యాయి. బాబు ఆదేశాలతో గోరంట్ల రూరల్‌కే పరిమితం అయ్యారు. 2019లో సిటీ సీటు ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవనీకి దక్కింది. ఆమె గెలిచారు.
భవానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. గోరంట్లకు సిటీ నియోజకవర్గంలో వేలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కానీ గోరంట్ల రాజకీయం అంతా సిటీలోనే సాగింది. 2014, 2019లోనే ఆయన రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అంతకు ముందు దాదాపు 32 ఏళ్లు సిటీ నియోజకవర్గం కేంద్రంగానే బుచ్చయ్య చౌదరి రాజకీయాలు చేశారు. ఇప్పుడు సిటీలో వేలు పెట్టొద్దనడం, తన అనుచరులకు పార్టీ పదవులు దక్కకపోవడంతో గోరంట్ల జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ లోపే సమస్యలు పరిష్కరించుకోలేకపోతే.. పార్టీలో తన పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందనే ఆందోళన గోరంట్లలో నెలకొంది. గత ఏడాది నవంబర్‌లో తన రాజకీయ వారసుడుగా సోదరుడు దివంగత శాంతారామ్ కుమారుడు డాక్టర్ రవిరామ్ కిరణ్‌ను బుచ్చయ్య చౌదరి మీడియా సమక్షంలో ప్రకటించారు. పార్టీలో పట్టు జారితే రాజకీయ వారసుడి ప్రకటన.. కేవలం ప్రకటనకే పరిమితం అవుతుందనే ఆదోళన కూడా గోరంట్లలో నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీలు మారే వారికి ఇచ్చిన ప్రాధాన్యత ఆది నుంచి పార్టీలో ఉన్న తనకు ఇవ్వడం లేదనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడైన గోరంట్ల అలకపాన్ను ఎక్కారు.
Also Read : పోలవరం పూర్తిపై బుచ్చయ్య చేసిన రాజీనామా సవాళ్లు తెలుసా..?
గోరంట్ల డిమాండ్లు ఏమిటో బాబుకు తెలిసింది. ఐతే వాటిని బాబు తీరుస్తారా..? అందుకు టీడీపీ ఏపీ అధ్యక్షుడైన కింజారపు అచ్చెం నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడులు ఒప్పుకుంటారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే అచ్చెంనాయుడు అన్న కింజారపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి అప్పారావు కోడలు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. భవాని స్వయానా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు అక్క. భవానికి ఉన్న కుటుంబ నేపథ్యంతోనే గత ఎన్నికల్లో ఆమెకు సిటీ టీడీపీ టిక్కెట్ లభించింది. ఆమె ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి కింజారపు కుటుంబం మద్ధతు తప్పకుండా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. గోరంట్ల డిమాండ్లకు తలొగ్గితే.. సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి భవాని భవిష్యత్‌కు ఇబ్బందులు ఏర్పడతాయి.
ఇప్పటికే తన వారసుడుగా రవిరామ్ కిరణ్‌ను ప్రకటించిన బుచ్చయ్య చౌదరి.. అతని కోసం సిటీ టిక్కెట్ కోసం పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. రూరల్ నియోజకవర్గం కన్నా.. సిటీ నియోజకవర్గమే చాలా సేఫ్ అని బుచ్చయ్య చౌదరికి తెలుసు. 2014, 2019 ఎన్నికల్లో రూరల్‌లో ఆయనకు గెలుపు అంత సులువుగా రాలేదు. 2014లో బీజేపీ, జనసేన మద్దతుతో గోరంట్ల బయటపడ్డారు. 2019లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ 40 వేల పైచిలుకు ఓట్లు చీల్చడంతో బుచ్చయ్య చౌదరి గెలిచారు. అదే సిటీలో అయితే కాపులు/జనసేన ప్రభావం చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో గోరంట్ల.. తన వారసుడు కోసం సిటీ టిక్కెట్ కోసం పట్టుబడతారు.
ఇప్పటి నుంచే గోరంట్లను సిటీ నుంచి దూరం పెడితే తప్పా.. రాబోయే రోజుల్లో తమ ఇంటి బిడ్డ భవాని రాజకీయ జీవితానికి ఇబ్బందులు ఉండవనేది కింజారపు ఫ్యామిలి భావన. మరి ఇలాంటి పరిస్థితుల్లో గోరంట్ల డిమాండ్లను చంద్రబాబు తీర్చేనా..? తీర్చేందుకు యత్నిస్తే ఆదిరెడ్డి భవానితోపాటు కింజారపు అచ్చెం నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులు అంగీకరిస్తారా..? చూడాలి గోరంట్ల ఎపిసోడ్ ఎలా సాగి.. ఎక్కడ ముగుస్తుందో.
Also Read : మరోసారి అలిగిన బుచ్చయ్య.. ఈసారి నిజంగానే రాజీనామా చేస్తారా..?