కౌశిక్ ఎమ్మెల్సీ ఫైలు రాజ్ భవన్ కు వెళ్లిందా?

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫైన‌ల్ చేశారంటే.. ఆ ఫైల్ చ‌క‌చ‌కా క‌ద‌లాల్సిందే. కానీ పాడి కౌశిక్ రెడ్డి విష‌యంలో ఎందుకు ఆల‌స్యం అవుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కౌశిక్ రెడ్డికి.. రావటం రావటంతోనే ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవటమే కాదు.. తన తీరుకు భిన్నంగా మంత్రివర్గ సమావేశంలో ప్రకటించేశారు. గవర్నర్ కు సిఫార్సు చేస్తామన్నారు. ఉత్తర్వులు రావటమే ఆలస్యమన్నంత హడావుడి జరిగింది. కానీ ఇంత వ‌ర‌కూ ఉత్త‌ర్వులు రాలేదు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈటల రాజేంద‌ర్ లాంటి బలమైన ఉద్యమనేత మీద మీద పోటీ చేసి మరీ.. గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకున్న సత్తా కౌశిక్ సొంతం. అయినప్పటికీ.. కౌశిక్ రెడ్డి పేరు రాష్ట్ర రాజ‌కీయాల్లో మొన్న‌టి వ‌ర‌కు పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఆయన పోటీ చేసిన ఓడిన హుజూరాబాద్ లో తప్పించి ఆయన గురించి.. ఆయనకున్న ఇమేజ్ గురించి చర్చ జరిగింది లేదు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారో.. తెర మీదకు ఒక్కసారి బయటకు వచ్చారు కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న వేళ మంత్రి కేటీఆర్ తో భేటీ కావటంతో అందరి కంట్లో ఆయన పడ్డారు. రేవంత్ కు సన్నిహితుడిగా కౌశిక్ కు పేరుంది. టీ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ కు అప్పజెప్పిన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేయటం ఖాయమని తేలింది.

కానీ.. ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి బయటకు లీక్ కావటంతో సీన్ మొత్తం మారిపోయింది. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమని.. అన్ని ఏర్పాట్లు చూడాలంటూ తన సన్నిహితుడితో మాట్లాడిన ఫోన్ కాల్ క్లిప్ బయటకు రావటం.. ఆ వెంటనే ఆయనపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం.. ఆయన గులాబీ కారు ఎక్కేయటం ఒకటి తర్వాత ఒకటి చొప్పున పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రాళ్లు వేశారన్న మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అది కూడా ఈటల నోటి నుంచి రావటంతో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే గ్యారంటీ చెప్ప‌లేం అన్న విషయాన్ని గుర్తించిన గులాబీ బాస్.. ఒక్కసారిగా తన గేమ్ ప్లాన్ ను మార్చేశారు. అప్పటివరకు హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో గులాబీ రేసు గుర్రంగా నిలుపుతారన్న దానికి భిన్నంగా.. ఆయన్ను ఎమ్మెల్సీగా నియమిస్తారని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పటం తెలిసిందే. కేసీఆర్ నోటి నుంచి ప్రకటన వచ్చి రెండు వారాలు దాటినప్పటికీ.. ఆయన నియామక ఉత్తర్వులు ఇప్పటివరకు ఎందుకు వెలువడలేదన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవటం.. అందుకు తగ్గట్లు గవర్నర్ కు సిఫార్సు చేయటం జరిగింది. అయినప్పటికి నియామక ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. సాధారణంగా సీఎం ఒకసారి డిసైడ్ అయిన రెండు.. మూడు రోజులకే గెజిట్ విడుదల కావటం కామన్ గా జరిగేది. అందుకు భిన్నంగా రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు ఎందుకు విడుదల కాలేదన్నది ప్రశ్నగా మారింది. కౌశిక్ ఎమ్మెల్సీ ఫైలు రాజ్ భవన్ కు వెళ్లిందా? అన్నది సందేహంగా మారింది.

క్రికెటర్ కోటాలో ఆయన్ను సిఫార్సు చేయటం వల్ల ఆయనకు గవర్నర్ అభ్యంతరం పెట్టే వీల్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో గవర్నర్ తమిళ సైకి సంబంధాలు బాగున్న నేపథ్యంలో ఫైల్ రాజ్ భవన్ లో ఆగే అవకాశం లేదు. ముఖ్యమంత్రి నుంచే ఫైల్ వెళ్లలేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం చూస్తే.. పార్టీలోకి ఇలా వచ్చిన వెంటనే అలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని టీఆర్ఎస్ లోని ఒక వర్గం గర్రుగా ఉందని.. అందుకే ఆగినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఒక సారి డిసైడ్ అయ్యాక.. ఇలాంటివి పట్టించుకుంటారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక లాంటి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. ఏ చిన్న డ్యామేజ్ కూడా లేకుండా వ్యూహాలు ర‌చిస్తున్న కేసీఆర్.. కౌశిక్ కు ఎమ్మెల్సీ ప్ర‌క‌ట‌న అనంత‌రం వెలువ‌డిన అభిప్రాయాల నేప‌థ్యంలో ఉప ఎన్నిక తర్వాత నియమిస్తే మంచిదన్న అభిప్రాయానికి వ‌చ్చారా అనే సందేహాలు క‌లుగుతున్నాయి. ఎమ్మెల్సీగా ఎంపిక చేశామన్న ప్రకటనను స్వయంగా సీఎం ప్రకటించిన తర్వాత కూడా అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువ‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల కౌశిక్ రెడ్డి ఇబ్బందిగా గుర‌వుతున్నార‌న్న మాట వినిపిస్తోంది.

Show comments