Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని తాపత్రయ పడుతున్న బీజేపీకి ఏదీ కలిసి రావడం లేదు. రాజధాని ఇష్యూ నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వరకూ ప్రతీదీ ఏపీ బీజేపీ లక్ష్యాలకు గండి కొడుతున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన సోము వీర్రాజు కొద్ది రోజులు మాత్రమే ఉత్సాహంగా దూకుడు ప్రదర్శించారు. అనంతరం ఏపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలలోకి వెళ్లలేని పరిస్థితి.
అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే సోము అమరావతి ప్రజల కోసం పోరాడదాం అని భావించారు. వంద రోజుల కార్యాచారణ కూడా ప్రారంభించారు. అనూహ్యంగా మూడు రాజధానుల నిర్ణయంపై అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఏపీ బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. కేంద్రం తీరు అలా ఉంటే.. రాష్ట్రంలో మరోలా మట్లాడే పరిస్థితి లేదని భావించి మధ్యేమార్గంగా అటు మూడు రాజధానులకు మద్దతు పలకకుండా, ఇటు అమరావతిని వ్యతిరేకించకుండా నిశ్శబ్దం పాటించారు.
అదలా ఉంచితే, తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు.. కేంద్రంతో మాట్లాడి ఆపే బాధ్యత మాది అంటూ ఏపీ బీజేపీ ఒకాల్తా పుచ్చుకుంది. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం మరోమారు కుండబద్దలు కొట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కితగ్గేది లేదని స్పష్టం చేసింది. వంద శాతం అమ్మి తీరతామని పేర్కొంది. ఇంతకుముందు అయితే ఓకే కానీ.. కొద్ది రోజుల ముందు మాత్రమే ఏపీ బీజేపీ రాష్ట్రానికి, కార్మికులకు భారీ భరోసా ఇచ్చింది. సీన్ కట్ చేస్తే.. కేంద్రం ఏమో ఇలా బాంబు పేల్చింది. దీంతో ఇక రాష్ట్రంలో ఉండి మాట్లాడే పరిస్థితి లేదని భావించిన ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.
మరి ఇప్పుడు ఢిల్లీ పర్యటన ద్వారా వీళ్లేం సాధించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపడానికి వెళ్లారా? ఆ సత్తా వీరికి ఉందా? వీరు చెబితే కేంద్రం వింటుందా? అంటే సమాధానం శూన్యం. అయితే, వీళ్లంతా వెళ్లింది విశాఖ ఫ్యాక్టరీ ఖాళీ స్థలాల గురించి చర్చించడానికి అని మరో వాదన ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సుమారు 28 వేల భూమిని సేకరించారు. అందులో పదివేల ఎకరాలు మినహా.. మిగతా 18 వేల ఎకరాలు ఖాళీగానే ఉండిపోయింది. తమ ప్రాంతానికి ఫ్యాక్టరీ వస్తోందన్న కారణంతో.. జనాలు తమ భూములు ఇచ్చేశారు. భూములు ఇచ్చిన వారికి ఉద్యోగం అనే హామీ ఇచ్చారు. కానీ.. మూడొంతుల మందికి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగమూ లేదు. భూములు పోయి, ఉద్యోగమూ లేక రెండు విధాలా నష్టపోయిన వారికి కనీసం భూములు తిరిగి ఇవ్వడం ద్వారా న్యాయం చేసే అవకాశాన్ని చర్చించాలని ఓ ప్రతిపాదన కేంద్రం ముందు ఇచ్చారట. మరి దీనిపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటో చూడాలి.
Also Read : పోలవరం ప్రాజెక్టు భవితవ్యంతో కేంద్రం ఆటలాడుతోందా.. పునరావాసంపై కప్పదాట్లు ఎందుకు?