మొన్న రామప్ప, నేడు ధోలవీర : పెరుగుతున్న వారసత్వ సంపద

సుమారు నాలుగు వేల ఐదువందల ఏళ్ల క్రితమే అక్కడి ప్రజలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలతో కూడిన నిర్మాణాలను కట్టుకున్నారు. స్నానవాటికలను ఏర్పాటు చేసుకున్నారు. పక్కా ప్రణాళికలతో విశాలమైన రోడ్లు, వీధులు నిర్మించుకున్నారు. నీటి విలువను గుర్తించి, బావులు తవ్వి నలువైపులా మట్టి కూలకుండా రాతితో గోడలు నిర్మించుకున్నారు. అతి పురాతనమైనదిగా ఖ్యాతికెక్కిన ఆ ప్రాంతమే హరప్పా నాగరికత కాలం నాటి ‘ధోలవీర’. ప్రపంచపటంలో ఈ ప్రాంతానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటుదక్కించుకుంది.

పురాతన భారతదేశ వారసత్వ సంపద నేడు విశ్వవ్యాప్తమవుతోంది. నిన్నటికి నిన్న భారత్‌ నుంచి 39వ ప్రపంచ వారసత్వ సంపదగా తెలుగు రాష్ట్రం తెలంగాణలోని రామప్ప ఆలయం చోటు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్‌లోని ‘ధోలవీర’కు 40వ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించింది. హరప్పాకాలం నాటి ఈ ప్రాంతం భారత్‌ నుంచి ప్రపంచ వారసత్వ సంపద కింద చోటు దక్కించుకున్న ప్రదేశాల్లో అత్యంత పురాతనమైనదిగా చరిత్ర చెబుతోంది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుజరాత్‌ నుంచి ‘ధోలవీర’ నాలుగోది కావడం విశేషం. ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి పావగఢ్‌ సమీపంలోని చంపానెర్‌, పటాన్‌లోని రాణీకి వావ్‌ (రాణికి సంబంధించిన మెట్లబావి), చారిత్రక నగరం అహ్మదాబాద్‌.. యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉన్నాయి.

హరప్పా నాగరికతలో రెండు అతిపెద్ద ప్రదేశాల్లో ధోలవీర ఒకటి. ఆ నాగరికతలో ఓ ప్రధాన నగరంగా క్రీ.పూ 2900 నుంచి 1500 దాకా ధోలవీర ఖ్యాతి పొందింది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లా బచావు తాలుకలోని ఖదిర్‌బెట్‌కు వెళితే ధోలవీరలో 120 ఎకరాల విస్తీర్ణంలో నాటి నిర్మాణాలకు సంబంధించి రాతిగోడలు, పునాదుల తాలూకు శిథిలాలు కనిపిస్తాయి. పైకి కనిపించే ఆ అవశేషాలను వెనుక హరప్పా ప్రజల జీవనశైలి కళ్లకు కడుతుంది. ఈ రోజుల్లోనూ మనదేశంలో చాలాచోట్ల అండ్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు లేవు. రోడ్లూ ప్రణాళిక ప్రకారం కాకుండా అడ్డ దిడ్డంగా ఉంటాయి. అయితే 4500 ఏళ్ల క్రితమే ధోలవీర ప్రజలు.. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారు. నీటి సంరక్షణకు నగర వ్యాప్తంగా 16 రిజర్వాయర్లను కట్టుకున్నారు. ఇది.. నీటి సంరక్షణ పరంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచీనమైన చర్యల్లో ఒకటిగా పరిశోధకులు భావిస్తారు.

దాదాపు 1400 ఏళ్లపాటు వర్ధిల్లిన ధోలవీర, హరప్పా నాగరికత సాధించిన అభివృద్ధి, సమున్నతస్థితి, పతనం సహా ఆ నాగరికతకు సంబంధించి కీలక పరిణామాలన్నింటికీ సాక్షీభూతంగా నిలిచింది. ధోలవీరను 1967 సంవత్సరంలో భారత పురతత్వ శాఖ అధికారులు తమ తవ్వకాల్లో గుర్తించారు. 1990 నుంచి కూడా అక్కడ అడపాదడపా తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో బంగారు, రాగి, పూసలతో కూడిన కొన్ని ఆభరణాలు, చేపల గాలలు, జంతు బొమ్మలు, పాత్రలు, ఇతక కళాత్మక వస్తువులు లభించాయి. ఈ ఆధారాలను బట్టి మెసొపొటమియా ప్రజలతో హరప్పా ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవని పరిశోధకులు నిర్ధారించారు.

విద్యార్థి దశలోనే మంత్రముగ్దుడినయ్యా : మోదీ

‘చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా వెళ్లి చూడాల్సిన ప్రదేశం ధోలవీర’ అని మోదీ పేర్కొన్నారు. విద్యార్థి దశలో తొలిసారిగా తాను ధోలవీరను చూసి మంత్రముగ్ధుడినయ్యానని గుర్తుచేసుకున్నారు.  గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వారసత్వ ప్రదేశాల పరిరక్షణ, అభివృద్ధిలో భాగంగా ధోలవీరను పర్యాటకులను ఆకర్షించే విధంగా తిర్చిదిద్దే అవకాశం తనకు లభించిందని చెప్పారు. ఈ సందర్భంగా ధోలవీరను తాను సందర్శించినప్పటి ఫొటోలను ఆయన షేర్‌ చేశారు.

ధోల్‌వీరను యునెస్కో గుర్తించడం పట్ల కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటిదాకా భారత్‌లో 10 స్థలాలు.. ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయని, దేశం మొత్తమ్మీద గర్తింపు పొందిన స్థలాల్లో ఇవి నాలుగో వంతు అని, భారత సంస్కృతిని ప్రోత్సహించడం పట్ల ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని ఆయన ట్విటర్‌లో రాశారు.

Show comments