హర్షకుమార్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ

అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు, వారి దృష్టిలో పడి మెప్పు పొందేందుకు అత్యుత్సాహంతో నేతలు చేసే కార్యక్రమాలు ఒక్కొసారి వారి మెడకే చుట్టుకుంటాయి. అప్పుడు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటూ నిట్టూర్చాల్సి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ, కాంగ్రెస్‌ నేత జీవీ హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌ విషయంలో ఇదే జరిగింది.

అత్యాచారం, హత్య జరిగిన ఘటనపై రాహుల్‌ గాంధీ చేసిన పోస్టును ట్విట్టర్‌ తొలగించి, ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై కాంగ్రెస్, ట్విట్టర్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని, నిరసన కార్యక్రమం చేసి అధినేత దృష్టిలో పడేందుకు జీవీ శ్రీరాజ్‌.. అందరికీ భిన్నంగా ఆలోచించారు. ఓ పిట్టను తెచ్చి నూనెలో వేయించి.. దాన్ని ముంబైలోని ట్విట్టర్‌ కార్యాలయానికి పోస్టులో పంపారు. యువనేత రాహుల్‌ గాంధీ దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనే జీవీ శ్రీరాజ్‌ ఈ పని చేసినట్లు ఆ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. సగం ఇంగ్లీష్, సగం తెలుగులో మాట్లాడిన జీవీ శ్రీరాజ్‌.. తాను చేసే పని ఢిల్లీ పెద్దలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

తానొకటి తలిస్తే.. ఢిల్లీ పెద్దలు మరొకటి తలిచినట్లుగా.. ప్రశంసలు వస్తాయనుకుంటే.. పార్టీ నుంచే సస్పెండ్‌ అయ్యారు జీవీ శ్రీరాజ్‌. పార్టీ అనుమతి లేకుండా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ లింగంశెట్టి ఈశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జీవీ శ్రీరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. జీవీ శ్రీరాజ్‌ చేసిన నిరసన వీడియో పార్టీ నియమావళికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

కుమారుడును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం హర్షకుమార్‌కు నిజంగా షాకింగ్‌ విషయమే. గత ఏడాదే హర్షకుమార్‌ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏపీసీసీ పదవి వస్తుందంటూ ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటిది హర్షకుమార్‌ తనయుడును పార్టీ నుంచే సస్పెండ్‌ చేయడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్న జీవీ హర్షకుమార్‌.. రాజమహేంద్రవరం మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో ఆయన దూకుడే ఓటమికి కారణమైంది. 2004, 2009ల్లో అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసి 9,931 ఓట్లు పొందారు. ఆ తర్వాత వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అమలాపురం టిక్కెట్‌ ఆశించిన జీవీ హర్షకుమార్‌.. బహిరంగ సభలో చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. అయితే టిక్కెట్‌ రాకపోవడంతో టీడీపీని వీడారు. ప్రాంతీయ పార్టీలలో అవకాశం రాదనుకున్నారో లేక మరే కారణమో గానీ.. తిరిగి గత ఏడాది కాంగ్రెస్‌ పార్టీలో తనకు తానుగా చేశారు. ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశించిన హర్షకుమార్‌కు..తాజాగా కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చిందని చెప్పచ్చు.

Show comments