కాంగ్రెస్ తో క‌టీఫ్ : విధానం అంటూ లేని జేడీఎస్‌

క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ రాజ‌కీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎవ‌రి పంచ‌న చేరుతుందో తెలియ‌డం లేదు. ఓ సారి కాంగ్రెస్, మ‌రోసారి బీజేపీ అంటూ మ‌ధ్య‌లో బీఎస్పీ అంటూ మారుతూనే ఉంటోంది. తాజాగా లోక‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రోసారి నిర్ణ‌యం మార్చుకుంది.

రాచనగరి మైసూరు నగరం వేదిక‌గా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం మైసూరు నగర పాలికెలో కాంగ్రెస్ – జేడీఎస్ లు పొత్తు కుదుర్చుకుని అధికారం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ తో క‌టీఫ్ చెప్పి, మ‌ళ్లీ బీజేపీతో జ‌ట్టు క‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ప్రతిపక్ష నేత సిద్దరామయ్యకు, స్థానిక జేడీఎస్‌ నేతలకు మధ్య సంబంధాలు బెడిసికొట్టిన‌ట్లు కొద్ది కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌తో కటీఫ్‌ చేసుకుని బీజేపీతో చేతులు కలిపేందుకు జేడీఎస్‌ నేతలు తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఇన్‌చార్జిమంత్రిగా ఉన్న ఎస్‌టీ సోమశేఖర్‌తో జేడీఎస్‌ నేత మాజీ మంత్రి సా రా మహేష్‌ శనివారం ప్రత్యేకంగా భేటీ కావడం తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం తమకు మేయర్‌ పదవి ఇవ్వాలని జేడీఎస్‌ షరతు విధించినట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా మేయర్‌ పదవి తమకు అప్పగిస్తే పొత్తుల విషయంలో ముందుకు సాగుదామని మంత్రి సోమశేఖర్‌ తెగేసి చెప్పినట్లు తెలిసింది. తమ పార్టీ హైమాండ్‌తో మాట్లాడాల్సిందిగా సారా మహేష్‌కు మంత్రి సూచించారు.

కొత్త పొత్తు బంధం కోసం మైసూరు ఎంపీ ప్ర‌తాప్ సింహ‌, మైసూరు నగర బీజేపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాగేంద్ర, జేడీఎస్‌ అగ్రనేత మాజీ సీఎం కుమారస్వామితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఉభయపార్టీల మధ్య పదవుల పంపకంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌తో తమ హనీమూన్‌కత ఇక ముగిసినట్లేనని బీజేపీతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని జేడీఎస్‌ నేత, మాజీ మంత్రి సా రా మహేష్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

2004లో దేవెగౌడ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చి రాష్ట్రంలో ధరమ్‌ సింగ్‌ నాయకత్వాన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించారు. రెండేళ్ల అనంతరం అంటే, 2006లో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకొని బీజేపీ మద్దతుతో తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోయింది. 2018లో మ‌ళ్లీ కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య చివరిక్షణంలో పొత్తు పొడిచింది. ప‌లు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్, జేడీఎస్ ల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు జ‌రిగింది. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ కు క‌టీఫ్ చెప్పిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇలా ఒక్కో ఎన్నిక‌లో, ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ పోతున్న‌ జేడీఎస్ రాజ‌కీయాలు చివ‌ర‌కు ఏ మ‌జిలీ చేర‌తాయోన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

Show comments