Idream media
Idream media
ఎంపీటీసీ భర్తకు సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం, వారి మధ్య జరిగిన సంభాషణ ఆడియో వెలుగులోకి రావడంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దళితబంధు పథకంపై చర్చించేందుకు, అనుమానాలు, అపోహలు తొలగించుకునేందుకు హైదరాబాద్ రావాలంటూ సదరు ఎంపీటీసీ భర్తకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. సాధారణంగా అయితే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ కేసీఆర్ ఫోన్ చేసింది త్వరలో ఉప ఎన్నికల జరగబోయే హుజురాబాద్ నియోజకవర్గంలోని తనగుల ఎంపీటీసీ నిరోష భర్త రామస్వామికి కావడంతోనే ఈ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది.
రామస్వామి స్వయంగా ఫోన్ చేసిన కేసీఆర్.. సమావేశానికి అతనిని ఎందుకు ఎంపిక చేశారు..? హైదరాబాద్‌కు ఎలా రావాలి..? ప్రభుత్వం ఏమేమి వసతులు సమకూర్చుతుంది..? వంటి అంశాలను సవివరంగా చెప్పారు. సమావేశం రోజున అంతా తాను మీతోనే ఉంటానని దళితబంధు పథకంపై చర్చించుకుందామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. హజురాబాద్‌లో దళితబంధు పథకం విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ పథకం విజయంతో దేశం, ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా ఉండాలన్నారు. అట్టడుగన ఉన్న జాతి అభివృద్ధి చెందాలనే ఈ పథకం ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ రామ స్వామితో అన్నారు. రాజేందర్ చిన్నోడు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఐదు నిమిషాలకు పైగా సంభాషించారు.
Also Read : ఈటల రాజేందర్ బలం కేసీఆర్ కు తెలుసా..?
తన ఏడేళ్ల పాలనలో ఏ పథకంపై పెట్టనంత శ్రద్ధ దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ పెట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది. దళితుల సాధికారత కోసం ఈ పథకం ప్రవేశపెడుతున్నామంటూ ప్రకటించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొదట అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం కోసం ముఖ్యమంత్రి సహా అధికారులు అందరూ చర్చోపచర్చలు, మేథోమథనాలు చేస్తుండడం విశేషం.
దళితబంధు పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న కేసీఆర్.. దళితుల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. దళిత సీఎం పేరిటి మోసం చేశారని, మళ్లీ అలాంటి పరిస్థితి రానీయొద్దంటూ ఇటీవల స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి, సెర్వోస్ వ్యవస్థాపకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఉప ఎన్నిక ఉండడం వల్లే హుజురాబాద్‌కు వేయి కోట్ల రూపాయలు కేటాయించారని ప్రవీణ్‌కుమార్ విమర్శించడం కేసీఆర్ వ్యవహారశైలిని విశదీకరిస్తోంది.
సీఎం కేసీఆర్‌పై ప్రవీణ్‌కుమార్ చేసిన విమర్శలు దళిత యువతను ఆలోచింపజేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల ప్రచారంలో దళితుడే సీఎంగా ఉంటారని కేసీఆర్ పదే పదే చెప్పారు. అంతేకాకుండా దళితులకు మూడెకరాల చొప్పన భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అవి హామీలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకం ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ హడావుడి చేస్తుండడంతోనే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ తాపత్రాయం అంతా దళితుల సాధికారత కోసమా..? లేక హుజురాబాద్ ఎన్నికల కోసమా..? అనే ప్రశ్నలు కేసీఆర్ ఎదుర్కొంటున్నారు.
Also Read : మోత్కుపల్లి వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్?