iDreamPost
iDreamPost
అయిన వాళ్లు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడమే అసలైన నాయకుడు లక్షణం. గతంలో వైఎస్సార్ అలాంటి సద్గుణాలతోనే సొంత వర్గాన్ని తెలుగు నేల నలుచెరుగులా ఏర్పాటు చేసుకున్నారు. చివరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని మించి తన హవాను చాటుకున్నారు. సరిగ్గా ఆయన వారసత్వంతో తండ్రి బాటలో ఓదార్పు యాత్ర పేరుతో అభిమానుల కోసం అడుగు బయటపెట్టిన జగన్ అదే పంథాను చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రిగానూ అదే తీరులో వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా కారణంగా సీఎం జగన్ పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన బయటకు వస్తే ప్రోటోకాల్, అభిమాన సందోహం కారణంగా ఏర్పడే సమస్యలను ఆయన గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నారు. కీలక అంశాలలో మినహా ఎక్కువగా ఆన్ లైన్ కే ప్రాధాన్యతనిస్తున్నారు. అనేక పథకాలను వర్చువల్ మీటింగ్స్ ద్వారానే ప్రారంభిస్తున్నారు. నిత్యం ప్రభుత్వ వ్యవహారాల్లో ఉంటున్నప్పటికీ అన్నీ క్యాంప్ ఆఫీస్ నుంచే నిర్వహించడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
అదే సమయంలో కొన్ని కీలక కార్యక్రమాలను మాత్రం ఆయన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన ప్రజల్లోకి వచ్చారు. దాదాపుగా కరోనా కాలమంతా సాగిన క్యాబినెట్ మీటింగుల కోసం సెక్రటేరియేట్ కి వెళ్లి వస్తూనే ఉన్నారు. అంతేగాకుండా తాజాగా తుంగభద్ర పుష్కరాల కోసం సుదీర్ఘకాలం తర్వాత కర్నూలు జిల్లా వెళ్లి వచ్చారు. అదే సమయంలో తన క్యాబినెట్ సహచరుడు, ముఖ్య అనుచరుల్లో ఒకరైన పేర్ని నాని తల్లి మరణించిన తరుణంలో ఆయన మచిలీపట్నం పయనమయ్యారు. మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణంతో శోకంలో ఉన్న ఆయన్ని ఓదార్చారు. తద్వారా తనకు సన్నిహితులైన వారి కోసం సమస్యలున్నప్పటికీ తాను ఎంత దూరమయినా వెళ్లేందుకు తండ్రి బాటను వీడబోనని నిరూపించుకున్నారు.
కరోనా కాస్త నిదానించిన తరుణంలో అందరినీ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూనే బందరు లో అడుగుపెట్టారు. ప్రజలు ఎక్కువగా సమీకృతం అయ్యే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా అధికారులను అప్రమత్తం చేసి ఎక్కువ మంది గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాను నేరుగా పేర్ని నాని కుటుంబాలను పరామర్శించడానికే ప్రాధాన్యతనిచ్చారు. ఆయన తో పాటుగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, సింహాద్రి రమేష్, జోగి రమేష్, పలువులు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా నాని తల్లి పేర్ని నాగేశ్వరమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.