Idream media
Idream media
తూటా కన్నా మాట పవర్‌ఫుల్ అంటారు. కాలు జారినా తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేమంటారు. అందుకే నరం లేని నాలుకను జాగ్రత్తగా ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. మాటలతోనే మిత్రులను, శతృవులను సృష్టించుకోగలం. ఆ మాటలతోనే ఆకాశానిక్కెగలం.. అవే మాటలతో అథఃపాతాళానికి పడిపోగలం. మాటల గురించి ఇప్పుడు ఇంతగా చెప్పుకోవడానికి కారణం టీడీపీ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.
గత నెల 28వ తేదీన టీడీపీ రాష్ట వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. చింతమనేని దెందులూరులో ఎడ్లబండికి దున్నపోతులను కట్టి వినూత్నశైలిలో ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరలపై ఆందోళన నిర్వహించడం వరకూ బాగానే ఉంది. ఇంతటితోనే ఆగితే అందులో చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకత ఏముంది..? ఎండ్ల బండిపై తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ, ఆ తర్వాత ఎమ్మార్వోకు వినతిప్రతం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేయాలంటే ముందు పోలీసుల అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుంటే సాదాసీదాగా కార్యక్రమం జరిగిపోతుంది. గుంపులో గోవింద మాదిరిగా శతకోటి బోడిలింగాల్లో తాను ఒకడిగా మిగిలిపోవడం తప్పా.. చింతమనేనికి వచ్చే పేరు ఏముంది..? అందుకే అనుమతి లేకుండానే అనుచరులు, టీడీపీ శ్రేణులతో భారీగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు అనుమతి విషయం చెప్పారు. ఛల్.. అనుమతిలేదు.. గినుమతిలేదు.. నేను వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసుతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసు అధికారులు, సిబ్బందిని నెట్టివేస్తూ అనుచరుల ఈలలు, అరుపులతో తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లారు. వినతిపత్రం ఇచ్చారు.
తర్వాత పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై కేసు నమోదైంది. మరుసటి రోజు అంటే 29వ తేదీన చింతమనేని విశాఖ జిల్లా నర్సీపట్నం వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. దెందులూరు పోలీసులు అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకువచ్చారు. స్టేషన్‌కి తీసుకువచ్చి నోటీసులు జారీ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది సాధారణంగానే జరిగే ప్రక్రియ. పోలీసులు తమ డ్యూటీ తాము చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఎక్కడా చింతమనేనిని ఇబ్బంది పెట్టలేదు. ఈ విషయం ఆయన కూడా చెప్పారు.
Also Read : పొమ్మంటే నేనే వెళ్ళిపోతానంటున్న కోమటిరెడ్డి…
ఇంతటితో చింతమనేని ఊరుకుంటే పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన స్టేషన్‌కు తీసుకువచ్చి వదిలేసిన తర్వాత.. వారిపై మీడియా సాక్షిగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. రాత్రిపూట అడవి మార్గం నుంచి తనను తీసుకువచ్చారని, అడవిలో చంపేసి మావోయిస్టులు చంపేశారని చెబితే దిక్కెవరని ప్రశ్నించారు. తనకు మావోయిస్టులతో ప్రమాదం లేదని, పోలీసులతోనే తన ప్రాణాలకు ముప్పు ఉందని అరోపణలు చేశారు.
చింతమనేని చరిత్ర తెలిసిన వారెవరూ ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోరు. కానీ ఆయన్ బ్యాక్‌గ్రౌండ్ తెలియని ప్రజలు.. అమ్మో పోలీసులు ఇంత పని చేసేవారా..? అని అనుకునే ప్రమాదం ఉందని పోలీసులు భావించారో ఏమో గానీ డీజీపీ ఈ ఎపిసోడ్‌లోకి ఎంటరయ్యారు. చింతమనేని ప్రభాకర్ పై ఉన్న రౌడీ షీట్, కేసుల గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ వివరాలు విన్న వారు.. వామ్మో చింతమనేని ఇలాంటి వాడా..? ఇలాంటి వాడిని పోలీసులు ఏం చేయగలరు..? అని అర్థం చేసుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైఎస్ హాయంలో మంత్రి వట్టి వసంతకుమార్‌పై సభలోనే దాడి చేయడం నుంచి మొన్న చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్వార్వో వనజాక్షిని ఇసుక ర్యాంపులోనే జుట్టుపట్టుకుని ఈడ్చిన వరకూ అన్ని సంఘటలను గుర్తు చేసుకున్నారు.
స్వయంగా డీజీపీనే తనపై ఉన్న కేసుల చిట్టాను బయటపెట్టడడంతో చింతమనేని ప్రభాకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన పేరును ప్రస్తావిస్తూ 84 కేసులు ఉన్నాయని డీజీపీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సిటీకి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. చంటిగాడు లోకల్ అని ఇడియట్ సినిమాలో రవితేజ చెప్పినట్లుగా.. డీజీపీలు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్ అంటూ చింతమనేని ప్రభాకర్ సినిమా సై్టల్‌లో డైలాగ్ చెప్పారు. తాను తప్పు చేసే పరిస్థితి రానీయొద్దని దేవుడుని కోరుకుంటాను గానీ ఎవరి ముందూ తలదించనని ఊగిపోయారు. తన కేసుల గురించి ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారని, తానే బకరాలా దొరికానా..? అంటూ వాపోయారు. వనజాక్షి కేసును మళ్లీ తిరగదోడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
మావోయిస్టులు కన్నా పోలీసులతోనే ప్రాణాలకు ముప్పని అనకుండా ఉంటే.. చింతమనేనికి ఈ చింత తప్పేది. ఇది 84వ కేసు అవుతుందంతే. కానీ అలా చేస్తే.. ఆయన చింతమనేని ప్రభాకర్ ఎలాఅవుతారు..?
Also Read : హర్షకుమార్ కలలు నెరవేరేనా?