నిన్న పంజాబ్‌.. నేడు ఛత్తీష్‌గఢ్‌.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు

శక్తియుక్తులు కూడదీసుకుని 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నేతల మధ్య విభేదాల వల్ల కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. ఒక రాష్ట్రంలో సమస్య తీరుతుందనుకునే లోపు.. మరో రాష్ట్రంలో వివాదాలు మొదలై.. అవి కాస్త ఢిల్లీకి చేరుకుని అధినేతలకు చికాకులు తెప్పిస్తున్నాయి. ఓ వైపు నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలా..? లేక పార్టీలో నేతల మధ్య అంతర్గతంగా తలెత్తుతున్న విభేధాలు పరిష్కరించాలా..? తెలియక.. యువ నేత రాహుల్‌ గాంధీ తికమకపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

నిన్నమొన్నటి వరకు పంజాబ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్, మాజీ మంత్రి, మాజీ క్రికెటర్‌ సిద్ధూ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటిని పరిష్కరించేందుకు రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌పెద్దలు నానా తంటాలు పడ్డారు. చివరికి సిద్ధూకు పీసీసీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. పంజాబ్‌లో మాదిరిగానే తాజాగా ఛత్తీష్‌గఢ్‌లోనూ ముఖ్యమంత్రి భూపేష్‌ బగేల్, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఆదిలోనే వారిద్దరి మధ్య విభేదాలు పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం పూనుకుంది. ఈ మేరకు ఇద్దరి నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు రాహుల్‌ గాంధీ.

2018లో ఛత్తీష్‌గఢ్‌లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగా.. భూపేష్‌ బగేల్, టీఎస్‌ సింగ్‌దేవ్‌ల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ ఏర్పడింది. ఆ సమయంలో రెండున్నరేళ్లు భూపేష్‌ బగేల్, చివరి రెండున్నరేళ్లు టీఎస్‌ దేవ్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉండేలా అధిష్టానం రాజీ చేసిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గడిచిన జూన్‌లో భూపేష్‌ బగేల్‌ ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లు పూర్తయింది. అప్పటి నుంచీ తనకు ఇచ్చిన హామీ అమలుపై టీఎస్‌ సింగ్‌దేవ్‌ ఎదురుచూస్తున్నారు. తన ప్రయత్నాలను తాను చేస్తున్నారు. తన పీఠానికి ఎసరుపెడుతున్నారనే భావనతో సీఎం భూపేష్‌ బగేల్‌ మంత్రి సింగ్‌ దేవ్‌పై గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారం ముదిరితే.. పార్టీకి నష్టమని భావించిన కాంగ్రెస్‌ పెద్దలు.. ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఈ వివాదం ఆదిలోనే పరిష్కారమవుతుందా..? లేదా పంజాబ్‌ మాదిరిగా తయారవుతుందా..? చూడాలి.

Also Read : కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్ట్, సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో సంచలనం

Show comments