Idream media
Idream media
అవసరమైతే ఎన్నికలకు సిద్ధం కావాలి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం.. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కేసులో హైకోర్టు చేసిన కామెంట్ ఇది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసుపై తాజాగా న్యాయస్థానంలో మరోసారి వాదనలు జరిగాయి. రమేశ్ పౌరసత్వం వివాదం వెనుక ఆసక్తికర కథ ఉంది. ఆయన ప్రత్యర్థి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఉంది.
అప్పట్లోనే భారత పౌరసత్వం రద్దు
డ్యూయల్ సిటిజెన్‌షిప్ కలిగి వున్న చెన్నమనేని మన దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గతంలోనే రమేశ్ భారత పౌరసత్వం చెల్లదని తీర్పునిచ్చింది. దానిపై రివ్యూకు వెళ్ళిన రమేశ్ కేసును కేంద్ర హోం శాఖ సుదీర్ఘ కాలం పరిశీలించిన అనంతరం రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, మోసపూరితంగా రమేశ్ భారత పౌరసత్వం పొందారని కేంద్రం స్పష్టం చేయడంతో అప్పట్లోనే రమేశ్ ఎమ్మెల్యే పదవి కోల్పోనున్నారని ప్రచారం జరిగింది. కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని రమేశ్ కోర్టులో సవాల్ చేశారు.
కమ్యూనిస్టు సీనియర్ నేత కుమారుడు…
దివంగత కమ్యూనిస్టు సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు రమేశ్. రాజేశ్వరరావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు బీజేపీ సీనియర్ నేత. మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2009లో రాజకీయాలకు గుడ్‌బై చెప్పే సమయంలో తన రాజకీయ వారసుడిగా చెన్నమనేని రమేశ్‌ను ప్రవేశపెట్టారు రాజేశ్వరరావు. 1993 వరకు భారత్‌లోనే ఉన్న రమేశ్ తర్వాత ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లారు. అక్కడే చదువు పూర్తి చేసుకొని ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందారు. అక్కడి మహిళనే వివాహం చేసుకొని జర్మనీలోనే స్థిరపడ్డారు.
రాజకీయాల కోసం భారత పౌరసత్వం
అయితే, తండ్రి నిర్ణయంతో 2009లో రమేశ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటికే భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని జర్మనీ పౌరసత్వాన్ని పొందిన రమేశ్ తిరిగి భారత పౌరసత్వం పొందారు. ఈ క్రమంలో భారత పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘించారనేది రమేశ్‌పై ఆరోపణ. భారత పౌరసత్వాన్ని మళ్లీ పొందాలంటే ఏడాది పాటు కచ్చితంగా భారత్‌లోనే ఉండాలి. ఈ సమయంలో ఏ దేశానికీ వెళ్లకూడదని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, రమేశ్ మాత్రం పౌరసత్వం పొందే ముందు కేవలం 96 రోజులు మాత్రమే భారత్‌లో ఉన్నారని, ఆ సమయంలోనూ రెండుసార్లు జర్మనీ వెళ్లారని ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ కోర్టుకు, కేంద్ర హోంశాఖకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన చెన్నమనేని రమేశ్ పదేళ్లలోనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ప్రజాక్షేత్రంలో ఓడిపోయినప్పటికీ…
నాలుగుసార్లూ ఆయనపై ఆదిశ్రీనివాస్ ఓడిపోయారు. ఆదిశ్రీనివాస్ కూడా స్థానికంగా పట్టున్న నాయకుడు. 2009లో రమేశ్ టీడీపీ నుంచి, ఆదిశ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా రమేశ్ రెండు వేల ఓట్లు స్వల్ప ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికలో ఆదిశ్రీనివాస్‌పైనే మళ్లీ ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రమేశ్ మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, ఆదిశ్రీనివాస్ బీజేపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రమేశ్ ఐదు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఆదిశ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా ఆయనపై నాలుగోసారి రమేశ్ గెలిచారు. నాలుగుసార్లు పోటీచేసిన ప్రజాక్షేత్రంలో రమేశ్‌పై ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ కేంద్ర హోంశాఖ నిర్ణయంతో రమేశ్‌పై గెలిచినట్లయింది.
ఆది శ్రీనివాస్ సుదీర్ఘ పోరాటం
ఎంతో కాలంగా ఆదిశ్రీనివాస్ హైకోర్టులో, సుప్రీం కోర్టులో రమేష్ ద్వంత్వ పౌరసత్వంపై పోరాడుతూనే ఉన్నారు. ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. పలుమార్లు విచారణల తర్వాత కేంద్ర హోంశాఖ రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. చెన్నమనేని తరఫు న్యాయవాది వాదిస్తూ చెన్నమనేని రమేశ్ బాబు పాస్పోర్ట్ పూర్తిగా ప్రయాణం కోసమే తీసుకున్నారన్నారు. అయన ప్రయాణానికి పౌరసత్వంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పౌరసత్వ చట్టం 1955 లోని సెక్షన్ 10 (3) ప్రకారం వ్యక్తి భారతదేశ పౌరుడిగా కొనసాగితే ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ప్రభుత్వం సంతృప్తి చెందితే తప్ప ఏ వ్యక్తి పౌరసత్వాన్ని కోల్పోలేరని ఆయన వాదించారు. చెన్నమనేనికి నేర నేపథ్యం లేదని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆయన అన్నారు. అతను తీవ్రవాదం గూఢచర్యం తీవ్రమైన వ్యవస్థీకృత నేరం లేదా యుద్ధ నేరాలలో ఏ విధమైన ప్రమేయం కలిగి లేడని పేర్కొన్నాడు. అందువల్ల కేంద్రం అతని పౌరసత్వం రద్దు చేయొద్దని అన్నారు.
కోర్టు వ్యాఖ్యలతో ఉప ఎన్నిక చర్చ
అయితే, ఓసీఐ దరఖాస్తులోనూ జర్మనీ పౌరుడుగా ప్రస్తావించారని.. ఓ వైపు భారతీయుడినని చెప్పుకుంటూనే 2023 వరకు జర్మన్ పాస్పోర్ట్ను పునరుద్ధరించాడని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదలుకున్నారని రమేష్ తరఫు న్యాయవాది రామారావు కోర్టుకు వివరించారు. పౌరసత్వాన్ని వదులుకున్నట్లయితే ఓసీఐ దరఖాస్తులో జర్మనీ పౌరుడిగా ఎలా పేర్కొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు తెలుసుకొని న్యాయస్థానానికి వివరిస్తామని పేర్కొనడంతో పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది. ఆ రోజున ఎమ్మెల్యే రమేశ్ బాబు పౌరసత్వంపై తీర్పు వెలవడే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కోర్టు ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో వేములవాడ నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు పిటిషనర్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే గతంలో చెన్నమనేని పౌరసత్వం రద్దయితే రెండో స్థానంలో ఉన్న వారిని ఎన్నుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ కోర్టు మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడలో మరోసారి ఉప ఎన్నిక జరగనుందా..? అని చర్చించుకుంటున్నారు.