Idream media
Idream media
తెలంగాణ కాంగ్రెస్ కు చీఫ్ అయినప్పటి నుంచీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విజృంభిస్తున్నారు. అయితే, ఆయన కాంగ్రెస్ నేతగా ఎంతగా దూకుడు ప్రదర్శిస్తున్నా గతం ఆయనను వెంటాడుతోంది. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో ఇప్పుడు ప్రత్యర్థులు దాన్నే టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇక ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం ఆయనకు మైనస్ గా మారింది. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అనుంగ శిష్యుడిగా రేవంత్ కు ఉన్న పేరును ప్రత్యర్థులు ఇప్పటికీ వల్లె వేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే తనపై టీడీపీ చంద్రబాబు ముద్ర పోయేందుకు రేవంత్ రెడ్డి పూనుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీపైన, చంద్రబాబుపై కూడా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డి కొద్ది కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిత్యం జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సర్కార్ పై వ్యాఖ్యలు చేయడంతో పాటు తన గురువుగా పేరున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై కూడా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికే టీడీపీ నుంచి బయటకు వచ్చానని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ విలువను గౌరవిస్తున్నానన్న రేవంత్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబును తాను ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు. తాను తిట్టడం లేదని తనను చంద్రబాబు మనిషి అంటున్నారని చెప్పుకొచ్చాడు.
అసలు తెలంగాణతో చంద్రబాబుకు సంబంధం లేదని.. ఏ సంబంధం లేని చంద్రబాబును తాను ఎందుకు తిట్టాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను సోనియా గాంధీ మనిషిని అని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అని రేవంత్ అన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టి విజయవంతం చేయడం ద్వారానే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తనపై నమ్మకం ఏర్పడిందని రేవంత్ రెడ్డి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. రైతులంతా కదిలివచ్చి రాజీవ్ రైతు దీక్షను విజయవంతం చేయడంతోనే తనకు పీసీసీ పదవి వచ్చిందని స్పష్టం చేశారు.
ఏదేమైనా.. అసలు చంద్రబాబును ఎందుకు తిట్టాలంటూనే.. ఆయనపై విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి తనకు అడ్డుగా వస్తున్న ప్రతీ అంశంపైన రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబును విమర్శించడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించారని పేర్కొంటున్నారు. చివరకు తెగించి బాబును సైతం విమర్శించిన రేవంత్ కు ఆ ముద్ర తొలగిపోయేనా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.