భూమా అఖిల – పోయిన ప‌రువు కోసం పోలీసుల మీద ఫిర్యాదా ?

కొంద‌రు చేసే ప‌ని చూస్తే వ‌హ్వా అనిపిస్తుంది. దెబ్బ‌కు దెబ్బ‌ భ‌లే తీశార్రా అని మ‌రికొంద‌రు అనిపించుకుంటారు. మాజీ మంత్రి భూమా అఖిల ఉద్దేశ్యం ఏంటో కానీ పోలీసుల‌పైనే ఫిర్యాదు చేశారు. సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులు ఫిర్యాదు చేశారంటే.. పోలీసుల‌కు చెమ‌ట‌లు ప‌డ‌తాయి. వామ్మో ఏం పాయింట్లు లేవ‌నెత్తారో, ఉన్న‌తాధికారులు ఏం చ‌ర్య‌లు తీసుకుంటారో అని ఆందోళ‌న చెందుతారు.

కానీ అఖిల ఫిర్యాదుపై భిన్న స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం.. ఆమెపై కిడ్నాపర్ స‌హా ప‌లు కేసులు ఉన్నాయి. భూ క‌బ్జాలో నిందితురాలిగా ఉన్నారు. పైగా.. కోర్టునే త‌ప్పుదోవ ప‌ట్టించార‌నే అప‌వాదు కూడా ఉంది. అలాంటి ఆమె విచార‌ణ పేరుతో పోలీసులు త‌న ఇంట్లోకి అక్ర‌మంగా చొర‌బ‌డ్డార‌ని ఫిర్యాదు చేయ‌డం హాస్యాస్ప‌దంగా మారింది.

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా అఖిల ప్రియ‌. ఆమె త‌ల్లిదండ్రుల‌కు రాజ‌కీయంగా ఎంత పేరుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వారి వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అఖిల చిన్న వ‌య‌సులోనే మంత్రి ప‌ద‌వి అయితే అనుభ‌వించారు కానీ, త‌ల్లిదండ్రుల లౌక్యం రాలేద‌ని ఆయా వ‌ర్గాల్లో కొంద‌రి అభిప్రాయం. తండ్రికి అత్యంత‌ సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని దూరం చేసుకోవడ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. దాని ఫ‌లితంగానే 2019లోజరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ప‌ద‌విలో ఉన్న‌ప్పుడే భూమా అఖిల సొంత వ‌ర్గానికే చేరువ కాలేక‌పోయారు. అలాంటిది పదవి చేతిలో లేనప్పుడు.. తానుప్రాతినిధ్యం వహించే పార్టీ గడ్డు పరిస్తితుల్లో ఉన్న వేళ.. తొందరపాటు చర్యలకు దిగరు. అయినప్పటికీ అందుకు భిన్నంగా వ్యవహరించి.. ఆ మధ్యన కిడ్నాప్ లాంటి సీరియస్ క్రైంలో ఆమె పేరు మారుమోగింది. అంతేకాదు.. ఆమె భర్త కోర్టు విచారణను తప్పించుకునేందుకు తప్పుడు కొవిడ్ సర్టిఫికేట్లను సమర్పించి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన వైనాన్ని చూసినోళ్లంతా విస్మయానికి గురయ్యే పరిస్థితి. తెలంగాణలో భూకబ్జా.. కిడ్నాప్ వ్యవహారంలో ఆమెతో పాటు.. ఆమె భర్త.. సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్లు బలంగా వినిపించటం.. వారంతా కొద్దిరోజుల పాటు పరారీలో ఉండటం తెలిసందే.

అలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న ఆమె కేపీహెచ్ బీపరిధిలోని లోథా అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ లోకి కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో బోయిన్ పల్లి పోలీసులు అనధికారికంగా చొరబడి విలువైన ఆస్తిపత్రాలు.. విలువైన డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లుగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంపై ఆమె వ్య‌వ‌హారం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.

హఫీజ్ పేట భూముల వ్యవహారంలో ఆమె.. ఆమె భర్త భార్గవ్ రామ్.. తమ్ముడికి బోయిన్ పల్లి పోలీసులు ఉచ్చు బిగించటం.. ఆ ఎపిసోడ్ లో ఆమె జైలుకు వెళ్లి రావటం తెలిసిందే. ఇలాంటివేళ.. కేపీహెచ్ బీ పోలీసులకు బోయిన్ పల్లి పోలీసుల మీద ఫిర్యాదు ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులపైనే ఫిర్యాదు చేసిందంటే.. అఖిల చాలా నిజాయితీప‌రురాల‌ని భావిస్తారు అనుకున్నారా లేక‌, డేరింగ్ అండ్ డేషింగ్ లేడీ అని పేరు పొందాల‌నుకుంటున్నారా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. దీని వ‌ల్ల ఒరిగే ప్రయోజనం కంటే కూడా డ్యామేజే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. అఖిల చ‌ర్య‌ల‌తో పోలీసు బాసులు సైతం మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

Show comments