Bandi sanjay -బండి సంజయ్ మీద కోడిగుడ్ల దాడి

తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్ళ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణా సిఎం కేసీఆర్ కాస్త ఘాటుగానే కేంద్రంపైనే ఆరోపణలు చేయగా దానికి బిజెపి నేతలు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నల్గొండ జిల్లాలో పరిశీలించడానికి వెళ్ళగా వాతావరణం కాస్త వేడెక్కింది. ఉదయం నుంచి ఏం జరుగుతుందో అనే విధంగానే పరిస్థితి మారింది. బిజెపి రాష్ట్ర నాయకులు కూడా అక్కడికి వెళ్తున్నారు అనే ప్రచారం జరిగింది.

బండి సంజయ్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్, అనుకూలంగా బీజేపీ నాయకుల పోటాపోటీ నిరసనలకు దిగారు. నల్లగొండ ఆర్జాల బావి ఐకెపి కేంద్రంలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా టిఆర్ఎస్ నిరసన,కోడిగుడ్లు, రాళ్లదాడులు చేయడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక మిర్యాలగూడలో బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు టిఆర్ఎస్ కార్యకర్తలు. రాళ్ళ దాడిలో కొందరు మీడియా ప్రతినిధులకు కూడా గాయాలు అయ్యాయి. నేరేడుచర్ల మండల పరిధిలోని చిల్లేపల్లి టోల్ ప్లాజా వద్ద భారీగా పార్టీ కార్యకర్తలు మొహరించి బండి సంజయ్ కు స్వాగతం పలికారు.

ఇక అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చిల్లేపల్లి వద్దకు చేరుకున్న జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్… బండి సంజయ్ తో మాట్లాడే ప్రయత్నం చేసారు. మిర్యాలగూడ పట్టణ శివారులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు లాఠీచార్జ్ కు దిగారు. మిర్యాలగూడ టౌన్ దాటిన వెంటనే మిల్లుల వద్ద నల్లజెండాలతో తెరాస నిరసన తెలిపింది. దీనితో సంజయ్ కాన్వాయ్ ని అతికష్టం మీద మిరియాల గూడ నుంచి పోలీసులు తప్పించారు. పెన్ పహాడ్, తాళ్ల ఖమ్మంపహాడ్ లలో బీజేపీ కాన్వాయ్ పై రాళ్ళ దాడికి దిగారు. టీఆరెస్, బీజేపీ ఘర్షణలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.

ఇక ఈ దాడులకు సంబంధించి బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ… శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై టీఆరెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు ఆయన. ఈ దాడులు పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. అలాగే రైతుల దగ్గరకి బీజేపీ నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందన్న రఘునందన్ రైతులకు తెరాస చేసిన మోసం, దగా పూర్తిగా అర్థం అయ్యిందని ఆరోపించారు. టీఆరెస్ వైఫల్యాల పై రైతులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైందని హెచ్చరించారు.

Also Read : కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారు..?

Show comments