బనగానపల్లెలో బస్తీమే సవాల్‌

అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక వైపు, ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యే మరో వైపు.. ఇద్దరూ మాటల తూటాలు పేల్చుతున్నారు. దమ్ము, ధైర్యం గురించి మాట్లాడుతూ సవాళ్లు, ప్రతిసవాళ్లుతో రాజకీయం వేడెక్కిస్తున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ నియోజకవర్గంగా ఉన్న బనగానపల్లెలో ఇప్పుడు నాటి పరిస్థితలు లేకపోయినా.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డిల మధ్య రాజకీయ వైరం రాజుకుంది. రాజకీయం ఎన్నికల వరకే పరిమితమై.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడినా.. ఇళ్ల పట్టాల పంపిణీపై బీసీ జనార్థన్‌ రెడ్డి కోర్టుకు వెళ్లినప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య వైరం పెరిగింది. అప్పటి నుంచి సందర్భానుసారం ఇద్దరు నేతలు మాటల తూటాలు వదులుతుండడంతో రాజకీయం వేడెక్కింది.

జగన్‌ గాలిలో గెలిచారు..

ఇటీవల వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారనే అభియోగాలతో నమోదైన కేసులో బీసీ జనార్థన్‌ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. ఏడాది నుంచి ఇరువురు నేతల మధ్య జరుగుతున్న విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జనార్థన్‌ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఊపందుకున్నాయి. ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకునే స్థాయికి పరిస్థితులు మారాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీసీ జనార్థన్‌ రెడ్డి.. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రామిరెడ్డి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గాలిలో గెలిచారని వ్యాఖ్యానించారు. కేవలం 11 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందన్న విషయం రామిరెడ్డి గుర్తుంచుకోవాలని ఆయనవిజయాన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. నిజంగా రామిరెడ్డికి అంత బలం ఉంటే.. రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలన్నారు. అలా గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీసీ జనార్థన్‌ రెడ్డి సవాల్‌ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.

నా దమ్ము గురించి తెలియదా..?

బీసీ జనార్థన్‌ రెడ్ది విమర్శలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధీటైన జవాబు ఇచ్చారు. తన దమ్ము, ధైర్యం ఏంటో బీసీ జనార్థన్‌ రెడ్డికి తెలియదా..? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో జరిగిన ప్రచార పర్వాన్ని రామిరెడ్డి గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉంది. జనార్థన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలోనే మీ వీధుల్లోకి వచ్చి ప్రచారం చేసిన నా దమ్ము, ధైర్యం గురించి తెలియదా..? అంటూ బీసీ జనార్థన్‌ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారు. జనార్థన్‌ రెడ్డి ప్రచార అర్భాటాలు మాత్రమే చేస్తారని, అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. ఇద్దరు నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలతో నియోజకవర్గంలో వాతావరణం వేడెక్కింది.

Also Read : బుచ్చయ్య రాజీనామా ,దుర్గేష్ ఎమ్మెల్యే ఆశలు– పెద్ద ప్లానే ఉన్నదే…!

Show comments