అమరావతిలో జరిగినట్లు ఫైబర్‌ నెట్‌లోనూ జరగదని గ్యారెంటీ ఉందా..?

అవినీతి ఆరోపణలు వస్తే.. ఆధారాలతో సహా నిరూపితమయ్యేంత వరకూ అవి అరోపణలే. ఆ ఆరోపణలు నిజమా..? కాదా..? అని తేలాలంటే దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలి. విచారణ పూర్తయిన తర్వాతే ఆయా ఆరోపణలపై అంచనాకు రావొచ్చు. అప్పటి వరకూ ఆరోపణలు అలానే ఉంటాయి. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుంటారు. ఏపీలో పలు అంశాలపై ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హాయంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అమరావతి భూముల కొనుగోళ్లు, ఏపీ ఫైబర్‌ నెట్‌ అంశాల్లో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బహిరంగ సవాళ్లు.. ఆపై స్టేల కోసం పాకులాటలు..

రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ వేలాది ఎకరాల భూములను టీడీపీలోని కొంత మంది నేతలు, చంద్రబాబు సన్నిహితులు కొనుగోళ్లు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై అసెంబ్లీలోనూ, బయట మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ నేతలు.. తాము ఏ తప్పూ చేయలేదని, దమ్ముంటే వైసీపీ ప్రభుత్వం నిరూపించాలని సవాళ్లు విసిరారు.

ప్రతిపక్షం చేస్తున్న సవాళ్లతోపాటు అమరావతి భూములపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. మంత్రుల కమిటీ చేసిన ప్రాథమిక విచారణలో కొన్ని ఆధారాలు లభ్యం కావడంతో.. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో తమకు వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ, ఏసీబీ సంస్థలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి.

విచారణ ప్రారంభమైన వెంటనే.. దమ్ముంటే నిరూపించాలంటూ సవాళ్లు విసిరిన టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. విచారణను అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపునకు పాల్పడుతోందని, అమరావతిలో అంతా సక్రమమే జరిగిందంటూ.. విచారణలపై స్టే విధించాలని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read : రఘురామ ‘‘కుట్ర‌’’తంత్ర రాజ‌కీయాల‌తో అధికారాన్ని చేజిక్కించుకోగ‌ల‌రా?

ఆరోపణలు వచ్చిన తర్వాత.. దమ్ముంటే విచారణ చేయాలని సవాళ్లు విసిరిన టీడీపీ నేతలు.. విచారణ ప్రారంభమైన తర్వాత స్టేలు కోసం కోర్టులకు వెళ్లడమే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం. అమరావతి భూముల వ్యవహారంలో ఏ తప్పూ జరగనప్పుడు విచారణ అంటే భయపడాల్సిన అవసరం ఏముంది..? విచారణను అడ్డుకునేందుకు స్టేలు ఇవ్వాలంటూ కోర్టులను ఆశ్రయించాల్సిన పనేముంది..? అనేవే సామాన్యులను సైతం ఆలోచింపజేస్తోంది.

విచారణ పూర్తయి అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని నిరూపితమైతే.. వైసీపీ ప్రభుత్వం ఇన్నేళ్లుగా అసత్య ఆరోపణలు చేస్తోంది.. అమరావతిని చంపేందుకు, మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకే దుష్ప్రచారం చేసిందంటూ.. టీడీపీ నేతలు చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చు. అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే టీడీపీ నేతల డిమాండ్‌కు బలం చేకూరుతుంది. 2019లో ఘోర ఓటమి తర్వాత ఆపసోపాలు పడుతున్న టీడీపీ మళ్లీ పుంజుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇవన్నీ టీడీపీ నేతలు ఆలోచించడం లేదేమోగానీ.. హైకోర్టు స్టేను సుప్రిం కూడా సమర్థించినంత మాత్రాన, విచారణ ఆగినంత మాత్రాన అమరావతిలో అంతా సక్రమంగానే జరిగిందనే మాట చెల్లుబాటు కాదు.

ఏపీ ఫైబర్‌ నెట్‌లోనూ..

ఏపీ ఫైబర్‌ నెట్‌లోనూ కుంభకోణం జరిగిందని, నాడు ఐటీ మంత్రిగా పని చేసిన నారా లోకేష్‌దే కీలక పాత్ర అనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇటీవల ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ విచారణ జరుపుతోంది. అమరావతి వ్యవహారంలో మాదిరిగానే.. ఏపీ ఫైబర్‌ నెట్‌ విషయంలోనూ టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌లో అంతా సక్రమంగా జరిగిందని వాదిస్తూ.. దమ్ముంటే నారా లోకేష్‌పై వచ్చిన ఆరోపణలు నిరూపించాలంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మీడియా ముందుకొచ్చారు. పట్టాభిరామ్‌ సవాల్‌ చేసినట్లుగా.. ఏపీ ఫైబర్‌ నెట్‌ వ్యవహారంలో నిజా నిజాలు నిగ్గు తేలాలంటే సీఐడీ విచారణ పూర్తి చేయాలి. ఛార్జిషీట్‌ దాఖలు చేయాలి. న్యాయస్థానంలో ఇరు వైపుల వాదనలు తర్వాత.. వాస్తవాలు నిగ్గుతేలుతాయి.

ఇదంతా జరగాలంటే సీఐడీ విచారణ పూర్తవ్వాలి. విచారణను ఆపాలంటూ అమరావతి విషయంలో మాదిరిగా ఫైబర్‌ నెట్‌పై సీఐడీ చేస్తున్న విచారణను అడ్డుకునేందుకు టీడీపీ స్టే కోసం కోర్టులకు వెళ్లకూడదు. నిరూపించాలంటూ సవాళ్లు విసిరిన పట్టాభిరామ్‌.. సీఐడీ విచారణను అడ్డుకునే ప్రయత్నం తమ పార్టీ చేయకుండా, విచారణ ఆపాలంటూ స్టే కోసం కోర్టులను ఆశ్రయించకుండా చూసే బాధ్యత తీసుకుంటారా..?

Also Read : మనసులో మాట మర్చిపోయారా బాబూ !

Show comments