Idream media
Idream media
గెలుపోటములు పట్టించుకోకుండా నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఆకుల వీర్రాజు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నుంచి వైసీపీ తరఫున రెండు సార్లు పోటీ చేసిన వీర్రాజును ఓటమి పలకరించింది. టీడీపీ తరఫున బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర నేత బరిలో ఉండడం, రెండు ఎన్నికల్లోనూ సొంత సామాజికవర్గం ఓట్లు దూరం కావడంతో వీర్రాజు ఓటమిపాలయ్యారు. అయినా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధతో నిర్వహించారు. కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్నారు. నిబద్ధతతో రాజకీయాలు చేసిన ఆకుల వీర్రాజుకు సీఎం వైఎస్ జగన్ జిల్లా కో సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ) పదవిని కట్టబెట్టి తగిన గౌరవం కల్పించారు.
కాపు నేత నుంచి రాజకీయాల్లోకి..
హోల్‌సేల్ పండ్ల వ్యాపారం చేసే ఆకుల వీర్రాజు జిల్లాలో కాపు నేతగా పేరొందారు. రాజమహేంద్రరం నగరంలో పెద్దమనిషిగా, వివిధ రంగాల వ్యాపారుల మధ్య తలెత్తే సమస్యలను ఆకుల వీర్రాజు పరిష్కరించేవారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యారు. కాపు సామాజివకవర్గం ఆధిపత్యం ఉన్న రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని, అదే సమయంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేశారు.
2014లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయగా.. ఆకుల వీర్రాజు వైసీపీ అభ్యర్థిగా బరిలోనిలుచున్నారు. మూడు పార్టీల తరఫున బరిలో ఉన్న బుచ్చయ్య చౌదరికి గట్టిపోటి ఇచ్చారు. 18,058 ఓట్ల మెజారిటీతో బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. ఓటమి తర్వాత ఆకుల వీర్రాజు మరింత పట్టుదలతో ఐదేళ్లపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను తిరిగారు. ఇంటింటికి నవరత్నాలు, గడపగడపకు వైఎస్సార్ వంటి కార్యక్రమాలను నిబద్ధతతో శ్రద్ధగా నిర్వహించారు.
Also Read : “ఫ్రూటీ” కుమార్ శ్రీమతికి చైర్మన్ గిరీ !
2019లో త్రిముఖ పోటీ..
వీర్రాజు పనితీరు, పట్టుదలను గమనించిన వైఎస్ జగన్.. రెండోసారి పోటీకి అవకాశం కల్పించారు. ఈ సారి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు సాగింది. టీడీపీ తరఫున బుచ్చయ్య చౌదరి, జనసేన తరఫున మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌లు బరిలో నిలుచున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కందుల దుర్గేష్.. 2017లో వైసీపీలో చేరారు. రాజమహేంద్రవరం రూరల్ సంయుక్త కో ఆర్డినేటర్‌గా పని చేశారు. ఆకుల వీర్రాజుతో కలిసి పని చేసిన దుర్గేష్.. స్థానిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేన పార్టీలో చేరారు. మంచి వాగ్ధాటి కలిగి, బలమైన కాపు నేతగా పేరున్న కందుల దుర్గేష్‌కు వైపు రూరల్ నియోజకవర్గంలోని మెజారిటీ కాపు ఓటర్లు, యువత నిలుచుంది. దీంతో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది.
త్రిముఖ పోరుతో మరోసారి ఆకుల వీర్రాజుకు నష్టపోయారు. కందుల దుర్గేష్ 42,685 ఓట్లు సాధించడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి 10,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆకుల వీర్రాజు 63,762 ఓట్లు పొందారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయినా కూడా ఆకుల వీర్రాజు ఎక్కడా నిరుత్సాహ పడలేదు. పార్టీ కోర్డినేటర్‌గా సమర్థవంతంగా పని చేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో వీర్రాజుకు మంచి పదవి దక్కుతుందని అందరూ ఆశించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించడంతో పదవి దక్కే సమయం ఆసన్నమైందని ఆయన అనుచరులు భావించారు. అందుకు తగినట్లుగానే తాజాగా సీఎం వైఎస్ జగన్ ఆయన్ను డీసీసీబీ చైర్మన్‌గా నియమించారు.
Also Read : నమ్ముకున్న వారికి న్యాయం ….. నామినేటెడ్ పదవులతో గోదావరి జిల్లాల నాయకుల్లో ఆనందం